
సెప్టెంబర్ 9న జరుగనున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ (నాలుగో ఎడిషన్) వేలంలో 13 మంది భారత ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అత్యంత ఆప్తుడు పియూశ్ చావ్లా.. ఐపీఎల్ మాజీ ఆటగాళ్లు సిద్దార్థ్ కౌల్ (ఆర్సీబీ), అంకిత్ రాజ్‌పుత్ (రాజస్థాన్ రాయల్స్) ఉన్నారు.
మిగతా 10 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. గుజరాత్‌కు చెందిన మహేశ్ అహిర్, పంజాబ్‌కు చెందిన సరుల్ కన్వర్, ఢిల్లీకి చెందిన అనురీత్ సింగ్ కతూరియా, రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ జగా, తమిళనాడుకు చెందిన కేఎస్ నవీన్, యూపీకి చెందిన ఇమ్రాన్ ఖాన్, అతుల్ యాదవ్, రాష్ట్రాల పేర్లు పొందుపరచని అన్సారీ మరూఫ్, మొహమ్మద్ ఫైద్, వెంకటేశ్ గాలిపెల్లి సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025 వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
వీరిలో పియూశ్ చావ్లా మినహా మిగతా ఆటగాళ్ల బేస్ ధర రూ. 10 లక్షలుగా నిర్ణయించబడింది. పియూశ్ బేస్ ధర రూ. 50 లక్షల రూపాయలుగా ఉంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీ వద్ద 7.4 మిలియన్ యూఎస్ డాలర్ల పర్స్ ధర మిగిలి ఉండగా.. 84 మంది ఆటగాళ్లను వేలం ద్వారా తీసుకునే అవకాశం ఉంది.
కాగా, భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా లీగ్ సహా ప్రపంచంలో ఏ ఇతర ప్రైవేట్ లీగ్‌లో ఆడాలన్నా బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌తో పూర్తి బంధాన్ని తెంచుకోవాలి. ఒక్కసారి ఎవరైనా భారత ఆటగాడు వేరే దేశం లీగ్‌లో ఆడితే, భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్ ఆడే అర్హత కోల్పోతాడు. ఏ భారత ఆటగాడైనా ఇతర దేశాల లీగ్‌ల్లో పాల్గొనాలనుకుంటే భారత క్రికెట్‌కు సంబంధించి అన్ని విభాగాలకు రిటైర్మెంట్ ప్రకటించి ఉండాలి.