
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్‌తో చేరుకోవడం మరో విశేషం.
వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్‌వైట్ (2016లో 853) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
మంధన@18
మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్‌లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.
కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.
చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు