
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.
తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్తోనే అందుకుంది.
బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్‌లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.
ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్గానూ మంధన రికార్డు నెలకొల్పింది.
వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.
ఈ మ్యాచ్‌లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్ల్లో).
వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్‌కు దక్కింది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్