
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో (India vs West Indies) పర్యాటక వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడుతుంది. తొలి ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ (5/82), రవీంద్ర జడేజా (3/46) ధాటికి 248 పరుగులకే కుప్పకూలిన ఆ జట్టు.. ఒటమి ఖరారు చేసుకొనే, రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఊహించిన విధంగానే 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్ పరాజయం దిశగా సాగుతున్న వేళ.. జాన్ క్యాంప్బెల్ (john Campbell), షాయ్ హోప్ (Shai Hope) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్యాంప్బెల్ 87, హోప్ 66 పరుగులతో అజేయంగా ఉన్నారు. వీరిద్దరు మూడో వికెట్కు అజేయమైన 138 పరుగులు జోడించారు. విండీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులుగా ఉంది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 97 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్‌నరైన్ చంద్రపాల్‌ను (10) సిరాజ్.. అలిక్ అథనాజ్ను (7) వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశారు.
దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్లో స్వల్ప స్కోర్కే పతనమైంది. 41 పరుగులు చేసిన అథనాజ్ టాప్ స్కోరర్ కాగా.. చంద్రపాల్ (34), జాన్ క్యాంప్బెల్ (10), షాయ్ హోప్ (36), టెవిన్ ఇమ్లాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17), ఖారీ పియెర్ (23), ఆండర్సన్ ఫిలిప్ (24 నాటౌట్), జేడన్ సీల్స్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్, జడేజాతో పాటు సిరాజ్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోర్ (518/5 డిక్లేర్) చేసింది. సాయి సుదర్శన్ (87) సెంచరీని మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ 38, నితీశ్ రెడ్డి 43, జురెల్ 44 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్కు 3, ఛేజ్కు ఓ వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విండీస్ను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్