న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరగాల్సిన నాలుగో టీ20 వర్షార్పణమైంది. నెల్సన్‌లోని సాక్స్ట్‌న్ వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. 6.3 ఓవర్ల తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.
వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆ సమయానికి విండీస్ స్కోర్ వికెట్ నష్టానికి 38 పరుగులుగా ఉంది. అలిక్ అథనాజ్ (21) ఔట్ కాగా.. ఆమిర్ జాంగూ (12), కెప్టెన్ షాయ్ హోప్ (3) క్రీజ్‌లో ఉన్నారు. అథనాజ్ వికెట్ నీషమ్‌కు దక్కింది.
ఆధిక్యంలో న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. మొదటి మ్యాచ్‌లో విండీస్ గెలువగా.. న్యూజిలాండ్ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.
కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ తర్వాత వన్డే సిరీస్, ఆతర్వాత టెస్ట్ సిరీస్ జరుగుతాయి. నవంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనుండగా.. డిసెంబర్ 2, 10, 18 తేదీల్లో టెస్ట్ మ్యాచ్‌లు మొదలవుతాయి.


