ఐపీఎల్ 2026కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు శుభవార్త అందింది. స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫామ్‌లోకి వచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా రైల్వేస్‌తో ఇవాళ (డిసెంబర్ 26) జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఫలితంగా అతని జట్టు ఆంధ్రప్రదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అలూర్ వేదికగా ఆంధ్ర, రైల్వేస్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు ప్రత్యర్ధిని 266 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. సత్యనారాయణ రాజు (10-1-41-3), కేఎస్ నరసింహ రాజు (10-0-68-3), హేమంత్ రెడ్డి (6-0-34-2), నితీశ్ కుమార్ రెడ్డి (10-0-34-1) అద్బుతంగా బౌలింగ్ చేసి రైల్వేస్‌కు భారీ స్కోర్ చేయనివ్వలేదు.
అయినా ఆన్ష్ యాదవ్ (59), రవి సింగ్ (76) అర్ద సెంచరీలతో పోరాడటంతో రైల్వేస్ ఓ మోస్తరుకు మించిన స్కోర్ అయితే చేయగలిగింది. ఆ జట్టు తరఫున జుబైర్ అలీ (48), రాజ్ చౌదరి (22 నాటౌట్) కూడా పోరాడారు. మిగతా బ్యాటర్లలలో సూరజ్ అహూజా 7, ప్రథమ్ సింగ్ 6, ఉపేంద్ర యాదవ్ 7, అశుతోష్ శర్మ 8, కర్ణ్ శర్మ 7, రాహుల్ శర్మ 12 పరుగులు చేశారు.
అనంతరం 267 పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర సునాయాస విజయం సాధించింది. బంతితో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి, హేమంత్ రెడ్డి బ్యాట్‌తో కూడా సత్తా చాటారు. నితీశ్ 41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 55 పరుగులు చేయగా.. హేమంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 41 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
వీరికి ముందు రికీ భుయ్ (76) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు పునాది వేశాడు. ఓపెనర్లు అశ్విన్ హెబ్బర్ (30), శ్రీకర్ భరత్ (25), వన్‌డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (40) పర్వాలేదనిపించారు. జట్టులో ప్రతి ఒక్కరు తలో చేయి వేయడంతో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.


