ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 3000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండిన వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.
గిల్‌క్రిస్ట్‌కు 3000 పరుగులు పూర్తి చేసేందుకు 3610 బంతులు అవసరం కాగా.. బ్రూక్ కేవలం 3468 బంతుల్లోనే ఈ మైలురాయిని తాకాడు. ఈ విభాగంలో బ్రూక్, గిల్‌క్రిస్ట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (4047), రిషబ్ పంత్ (4095), వీరేంద్ర సెహ్వాగ్ (4129) ఉన్నారు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో యాషెస్ టెస్ట్ తొలి రోజు బ్రూక్ ఈ ఘనత సాధించాడు.
ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ తన దేశానికే చెందిన డెన్నిస్ కాంప్టన్‌తో కలిసి సంయుక్తంగా 11వ స్థానంలో నిలిచాడు. బ్రూక్, కాంప్టన్ ఇద్దరూ 57వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని తాకారు. ఈ విభాగంలో డాన్ బ్రాడ్‌మన్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ దిగ్గజం కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఇప్పటివరకు 34 టెస్ట్‌లు ఆడిన బ్రూక్ 54.18 సగటున, 10 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 3034 పరుగులు చేశాడు. ఇందులో డబుల్, ట్రిపుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ (డిసెంబర్ 26) యాషెస్ సిరీస్ 2025-26 నాలుగో టెస్ట్ (బాక్సింగ్ డే టెస్ట్) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజే 20 వికెట్లు కుప్పకూలాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాను 152 పరుగులకే ఆలౌట్ చేసింది. జోష్ టంగ్ (11.2-2-45-5), అట్కిన్సన్ (14-4-28-2), బ్రైడన్ కార్స్ (12-3-42-1), స్టోక్స్ (8-1-25-1) ఆసీస్‌ను దెబ్బకొట్టారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ఆటగాడు మైఖేల్ నెసర్ (35) టాప్ స్కోరర్ కాగా.. హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10), ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ క్యారీ (20), కెమరూన్ గ్రీన్ (17) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. లబూషేన్ (6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (9), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. బోలాండ్ డకౌటయ్యాడు.
అనంతరం ఇంగ్లండ్ సైతం ప్రత్యర్థి బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. నెసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2, గ్రీన్ ఓ వికెట్ తీసి ఇంగ్లండ్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ (41), అట్కిన్సన్ (28), స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. జాక్ క్రాలే (5), డకెట్ (2), బేతెల్ (1), జేమీ స్మిత్ (2), విల్ జాక్స్ (5), కార్స్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. రూట్ డకౌటయ్యాడు.
కీలకమైన 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసి, 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు టెస్ట్‌ల్లో గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం 3-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.


