వెల్లింగ్టన్: తమ నుంచి తమ ఐదేళ్ల కుమారుడిని దూరం చేయొద్దని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని ఓ భారతీయ కుటుంబం అభ్యర్థిస్తోంది. ‘ మా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కానీ అతన్ని మా నుంచి దూరం చేస్తే మా కుటుంబం చిద్రమవుతుంది’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి వీసా విషయంలో ప్రభుత్వం మానవతా దృష్టితో చూడాలని వారు కోరుతున్నారు.
న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. భారత్‌కు చెందిన నితిన్ మాంకీల్, ఆయన భార్య అపర్ణ జయంధన్ గీత ఆక్లాండ్‌లో నివసిస్తున్నారు. ఇద్దరు వైద్య రంగంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు ఐదేళ్ల ఐదన్ నితిన్ (Aidhan Nithin). ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అతనికి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే అతన్ని భారత్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే ఐధాన్ వీసా విషయంపై న్యూజిలాండ్ అసోసియేట్ ఇమ్మిగ్రేషన్ మంత్రి హాన్ క్రిస్ పెంక్‌కు రెండుసార్లు అప్పీలు చేశారు. కానీ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐధాన్ ఆరోగ్య పరిస్థితి దేశంలోని ఆరోగ్య, విద్యా సేవలపై అధిక భారం అవుతుందని అధికారులు భావించారు. తల్లిదండ్రులకు పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్నప్పటికీ బాలుడికి వీసాను తిరస్కరించింది.
వీసా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదన్ నితిన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థిక సహాయం కోరడం లేదని, ఆటిజం సమస్యతో బాధపడుతున్న తమ కుమారుడి పట్ల మానవతా కోణంలో వీసా మంజూరు చేయాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.
ఈ ఘటన న్యూజిలాండ్‌లో వలస విధానాలపై మానవతా కోణం ఎంత ముఖ్యమో మరోసారి బయటపెట్టింది. ఆటిజం బాధిత బాలుడిని డిపోర్ట్ చేయాలన్న నిర్ణయం స్థానికులు, భారతీయ వలసదారులు, మానవ హక్కుల సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు న్యూజిలాండ్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది.


