న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయింది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-3 తేడాతో చేజార్చుకున్న కరీబియన్ జట్టు.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2 తేడాతో కోల్పోయింది.
నేపియర్ వేదికగా ఇవాళ (నవంబర్ 19) జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో విండీస్ కెప్టెన్ వీరంగం చేశాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ, విధ్వంసకర శతకం బాదాడు.
కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
విండీస్ ఇన్నింగ్స్‌లో హోప్ 109 పరుగుల తర్వాత రెండో అత్యధిక స్కోర్ కేవలం 22 పరుగులు మాత్రమే. అకీమ్ అగస్ట్, జస్టిన్ గ్రీవ్స్, రొమారియో షెపర్డ్ తలో 22 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లలో మాథ్యూ ఫోర్డ్ (21), రూథర్‌ఫోర్డ్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 4, జేమీసన్ 3, టిక్నర్, సాంట్నర్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (90), రచిన్ రవీంద్ర (56) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆఖర్లో టామ్ లాథమ్ (39 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (34 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో న్యూజిలాండ్ మరో 3 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.
నామమాత్రపు చివరి వన్డే హ్యామిల్టన్ వేదికగా నవంబర్ 22న జరుగనుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.
19వ సెంచరీ
ఈ ఇన్నింగ్స్‌తో హోప్ ఈ ఏడాది విండీస్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ సెంచరీ హోప్‌కు వన్డేల్లో 19వది. క్రిస్ గేల్ (25) తర్వాత వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసింది హోపే. 19 శతకాలను హోప్ కేవలం 142 ఇన్నింగ్స్‌ల్లో సాధించడం మరో విశేషం. ఈ సెంచరీలకు హోప్ 12 దేశాలపై చేశాడు.


