స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను న్యూజిలాండ్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. డునెడిన్ వేదికగా ఇవాళ (నవంబర్ 13) జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ విండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్ (18.4 ఓవర్లలో) చేసింది. జేకబ్ డఫీ (Jacob Duffy) 4 వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు.
మరో పేసర్ జిమ్మీ నీషమ్ 2, జేమీసన్, బ్రేస్‌వెల్, సోధి, సాంట్నర్ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ (36) బ్యాట్ ఝులిపించకపోయుంటే విండీస్ ఈ మాత్రం స్కోర్ కూడా చేయలేకపోయేది. వీరితో పాటు జేసన్ హోల్డర్ (20), రోవ్‌మన్ పావెల్ (11), షాయ్ హోప్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్ (45), డెవాన్ కాన్వే (47 నాటౌట్) రాణించడంతో 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కివీస్ గెలుపులో రచిన్ రవీంద్ర (2), చాప్‌మన్ (21 నాటౌట్) కూడా తలో చేయి వేశారు. షెపర్డ్, స్ప్రింగర్‌కు తలో వికెట్ దక్కింది.
ఈ సిరీస్‌లో విండీస్ తొలి మ్యాచ్‌లో గెలువగా.. న్యూజిలాండ్ 2, 3, 5 టీ20లు గెలిచింది. వర్షం కారణంగా నాలుగో టీ20 రద్దైంది. నవంబర్ 16 నుంచి ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 2 నుంచి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కూడా జరుగుతుంది.


