ప్రముఖ పాకిస్తాన్ అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ ఉబేదుల్లా రాజ్‌పుత్ నిషేధానికి గురయ్యాడు. అతను బహ్రెయిన్‌లో ఈ నెలారంభంలో జరిగిన ఓ ప్రైవేట్ టోర్నీలో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. విదేశీ టోర్నీలో ఇలా ఆడాలంటే పాకిస్తాన్ కబడ్డీ సమాఖ్య (పీకేఎఫ్) నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) తీసుకోవాలి.
కానీ ఉబేదుల్లా మాత్రం ఎలాంటి ఎన్‌ఓసీ లేకుండానే బహ్రెయిన్ ఈవెంట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దీంతో పీకేఎఫ్ అతని నిర్వాకంపై కన్నెర్ర జేసింది. ఉబేదుల్లాపై నిరవధిక నిషేధం విధించినట్లు పీకేఎఫ్ కార్యదర్శి రాణా సర్వార్ వెల్లడించారు.
అయితే ఈ నిషేధంపై క్రమశిక్షణ కమిటీ ముందు అప్పీల్‌కు వెళ్లే హక్కు రాజ్‌పుత్‌కు ఉందని ఆయన చెప్పారు. ఈ నెలలో బహ్రెయిన్‌లో జీసీసీ కప్ టోర్నీ జరిగింది. ఇందులో ఉబేదుల్లా రాజ్‌పుత్ భారత జెర్సీ వేసుకొని, త్రివర్ణ పతాకంతో కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పీకేఎఫ్ చర్యలు చేపట్టింది.
చదవండి: క్రికెట్ ఆ్రస్టేలియాకు రూ. 60 కోట్ల నష్టం!


