
సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజన్‌కు ముందు కావ్య మారన్ జట్టు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త కెప్టెన్‌ను ప్రకటించేందుకు సిద్దమైంది. తొలి సీజన్ నుంచి సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఐడైన్ మార్‌క్రమ్.. నాలుగో సీజన్‌కు ముందు తెగదెంపులు చేసుకున్నాడు.
వేలంలోకి వచ్చిన అతడిని రూ.7 కోట్ల భారీ ధరకు డర్బన్ సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఈ వేలంలో మార్‌క్రమ్‌ను తిరిగి దక్కించుకోవడానికి సన్‌రైజర్స్ రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించింది. కానీ డర్బన్ భారీ ధర చెల్లించేందుకు సిద్దం కావడంతో ఈస్టర్న్ కేప్ వెనక్కి తగ్గింది.
కెప్టెన్‌గా ట్రిస్టన్ స్టబ్స్..
కాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కొత్త కెప్టెన్‌గా 25 ఏళ్ల యువ ఆటగాడు, సౌతాఫ్రికా సూపర్ స్టార్ ట్రిస్టన్ స్టబ్స్ ఎంపిక దాదాపు ఖారైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బ్యాటింగ్ కోచ్ రస్సెల్ డొమింగో ధ్రువీకరించాడు. ఇప్పటికే అతడి కెప్టెన్‌గా నియమిచేందుకు యాజమాన్యం సైతం అంగీకరించినట్లు డొమింగో తెలిపాడు.
రాబోయే రెండు సీజన్ల పాటు తమ కెప్టెన్‌గా స్టబ్స్ వ్యవహరించనున్నాడని అతడు తెలిపాడు. త్వరలోనే సన్‌రైజర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. అయితే జట్టులో సీనియర్లు క్వింటన్ డి కాక్, లూయిస్ గ్రెగొరీ, జానీ బెయిర్‌స్టో, మార్కో జాన్సెన్ వంటి ప్లేయర్లు ఉన్నా.. టీమ్ యాజమాన్యం స్టబ్స్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.
సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్ నుంచి సన్‌రైజర్స్‌తోనే స్టబ్స్ కొనసాగుతున్నాడు. మూడు సీజన్లలో అతను మొత్తం 723 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ 140.11 పైగా ఉండడం విశేషం.