
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఓడిపోయిన తర్వాత ఇలాంటి కుంటిసాకులు చెప్పడం అస్సలు బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘అందని ద్రాక్ష పుల్లన’’ అనుకునే ‘నక్క’ మాదిరి వేషాలు వేయొద్దంటూ తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాస్తూ తొలిసారి ఆతిథ్య జట్టు (IND Beat ENG)పై విజయ ఢంకా మోగించింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి వెయ్యికి పైగా పరుగులు సాధించి.. ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
ఉపఖండ పిచ్ మాదిరే ఉంది
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నిజం చెప్పాలంటే.. ఈ వికెట్ ఉపఖండ పిచ్ మాదిరే ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పరుగులు రాబట్టడం కష్టతరంగా మారింది.
పర్యాటక జట్టుకు అలవాటైన పిచ్‌లా మారిపోయిందనిపించింది. భారత బౌలింగ్ దళం తమకు అనుకూలమైన మాదిరి పిచ్‌పై బాగా ఆడింది’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఉపఖండ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.
పేసర్లకు 18 వికెట్లు
అయితే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పొడిగా ఉంటుంది కాబట్టి బంతి టర్న్ అవుతుందనుకున్నా.. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లే 18 వికెట్లు పడగొట్టారు. స్పిన్ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ తలా ఒక్క వికెట్ మాత్రమే తీశారు.
దీనిని బట్టి టీమిండియా కొత్త బంతితో ఎంత అద్భుతంగా రాణించిందో అర్థమవుతోంది. అయినప్పటికీ స్టోక్స్ ఇలా పిచ్‌ను సాకుగా చూపి.. టీమిండియా గెలుపును తక్కువ చేసేలా మాట్లాడటం అభిమానులకు రుచించలేదు. దీంతో.. ‘‘ఇంత ఏడుపు దేనికి?.. హుందాగా ఓటమిని అంగీకరించవచ్చు కదా’’ అంటూ అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
వరల్డ్ క్లాస్ టీమ్
ఇక ఏదేమైనా భారత్ వరల్డ్ క్లాస్ టీమ్ అంటూ ప్రశంసించిన స్టోక్స్.. శుమ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడటం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ద్విశతకం (269), శతకం (161) బాదగా... పేసర్ ఆకాశ్ దీప్ పది వికెట్లతో చెలరేగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10- 14 మధ్య జరుగనున్న మూడో టెస్టుకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదిక.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు- సంక్షిప్త స్కోర్లు
👉భారత్: 587 & 427/6 డిక్లేర్డ్
👉ఇంగ్లండ్: 407 & 271
👉ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ జయభేరి.
చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్