
త్వరలో అందుబాటులోకి టెస్లా ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబో
వివరాలు వెల్లడించిన ఎలాన్ మస్క్
లాస్ ఏంజెలెస్: వేడివేడి పాప్‌కార్న్ కావాలంటే చెఫ్‌కే చెప్పనక్కర్లేదు. తమ హ్యూమనాయిడ్ రోబోట్‌కు చెప్పినా చకచకా చేసి ఇచ్చేస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారు. తమ ‘టెస్లా’ సంస్థ అభివృద్ధిచేస్తున్న హ్యూమనాయిడ్ రోబో త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని మస్క్ ప్రకటించారు. లాస్‌ఏంజెలెస్ నగరంలోని ప్రఖ్యాత హాలీవుడ్ ప్రాంతంలో టెస్లా కొత్తగా ‘డిన్నర్, సూపర్‌చార్జర్’ అనే రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటుచేస్తోంది. ఇందులో ఆప్టిమస్ పేరిట ఒక రోబోట్‌ను అందుబాటులోకి తేనున్నారు.
ఇది పోప్‌కార్న్‌ను ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసి అతిధులు, వినియోగదారులకు అందిస్తుంది. సంబంధిత వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. అడిగిందే తడవుగా కస్టమర్‌కు కవర్‌లో పాప్‌కార్న్‌ను సర్వ్‌చేయడం, ప్రతిగా ధన్యవాదాలు తెలిపిన కస్టమర్‌కు రోబోట్ చేయి ఊపుతూ అభివాదంచేయడం ఆ వీడియోలో ఉంది. ‘‘ ఈరోజు ఇంటర్నెట్‌లో చూడదగ్గ వీడియో ఉందంటే అది ఇదే. కస్టమర్‌కు ఆప్టిమస్ ఎంత చక్కగా, పద్ధతిగా, మర్యాదగా సర్వ్ చేస్తోందో చూడండి. ఇదంతా త్వరలో సర్వసాధారణ విషయంగా మారబోతోంది’’ అని మస్క్ ‘ఎక్స్’లో క్యాప్షన్ పెట్టారు.
హాలీవుడ్‌లోని శాంటామోనికా బోల్వార్డ్ ప్రాంతంలో ఈ అధునాతన డిన్నర్, సూపర్‌చార్జర్ రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ‘‘ భవిష్యత్తులో ఈ రోబోలు మన దైనందిన జీవిత పనులన్నీ చేస్తూ మనకు సాయంగా ఉంటాయి. మనం కూర్చున్న చోటుకే వచ్చి మనకు కూల్‌డ్రింక్స్ అందిస్తాయి. పెంపుడు శునకాన్ని అలా బయట వాకింగ్‌కు తీసుకెళ్తాయి. పిల్లలను ఆడిస్తాయి’’ అని గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోబోల సంబంధ ‘మనం’ కార్యక్రమంలో మస్క్ వ్యాఖ్యానించారు.