
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక దళం గాజాలో 75 ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఫలితంగా నగరంలో దట్టమైన పొగతో పాటు మంటలు ఎగసిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. హమాస్ కమాండర్ బషర్ థాబెట్‌ను ఐడీఎఫ్ హతమార్చింది.
హమాస్ అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ కమాండర్ బషర్ థాబెట్ మృతిని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించాయి. హమాస్ ఆయుధ ఉత్పత్తి, పరిశోధన కార్యకలాపాలను పర్యవేక్షించడంలో పేరొందిన థాబెట్.. ఇజ్రాయెల్ దాడుల్లో హతం కావడం హమాస్‌కు తీరనిలోటుగా పరిణమించింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ హమాస్ ఉపయోగించే ఆయుధాల తయారీ ప్రదేశాలు, కీలక ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.
ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఎఎఫ్)గాజాలోని సైనిక స్థావరాలు, సెల్ సైట్‌లతో సహా దాదాపు 75 లక్ష్యాలను విజయవంతంగా ఢీకొట్టిందని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. యుద్ధం కారణంగా పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ తాజా ఆపరేషన్ జరిపింది. గడచిన 24 గంటల్లో 115 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా ఆహారం, నీరు, వైద్య సామాగ్రి కొరత ఏర్పడి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ, ట్యునీషియా, ఇరాక్, టర్కీ, లెబనాన్, మొరాకోతో సహా అనేక దేశాలలో నిరసనలు కొనసాగుతున్నాయి. సంఘర్షణలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనియన్లు.. ఇజ్రాయెల్ స్థిరనివాసుల నీటి వనరులపై దాడులను మరింతగా పెంచారు. ఇరువర్గాల మధ్య శాంతి చర్చలు స్తబ్దుగా ఉండటంతో, కాల్పుల విరమణకు అవకాశాలు అనిశ్చితంగానే ఉన్నాయి. ఫలితంగా గాజాలో మానవతా సంక్షోభం మరింతగా పెరుగుతూ వస్తోంది.