
గాజాలోని ఆహార కేంద్రాల వద్ద అమానవీయ చర్యలు
తీవ్రంగా ఖండించిన యూకే, ఫ్రాన్స్ తదితర 23 దేశాలు
59 వేలు దాటిన పాలస్తీనియన్ల మరణాలు
గాజా/లండన్: గాజాలోని అన్నార్తుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐరాస తీవ్రంగా ఖండించింది. ఆహార కేంద్రాల వద్దకు వచ్చే వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పుల జరుపుతోందంటూ మండిపడింది. ఆదివారం ఒక్క రోజే 80 మంది ఉసురుతీయడాన్ని ప్రస్తావించిన ఐరాస ఆహార విభాగం(డబ్ల్యూఎఫ్‌పీ)..పాలస్తీనియన్ల పాలిట భయంకరమైన రోజుల్లో ఒకటని అభివర్ణించింది.
ఆదివారం ఆహార పదార్థాలతో గాజానగరంలోకి ప్రవేశించిన ట్రక్కుల దిశగా వెళ్తున్న వారిపైకి ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారీ సంఖ్యలో జనం చనిపోవడం తెల్సిందే. కాగా, డబ్ల్యూఎఫ్‌పీ ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇలా ఉండగా, ఆదివారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగించిన వైమానిక దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు.
సెంట్రల్ గాజాలోని నెట్‌జరిమ్ కారిడార్ వద్ద గుంపుగా చేరిన పాలస్తీనియన్లపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. హమాస్ శ్రేణులు లక్ష్యంగా 21 నెలలుగా యథేచ్ఛగా ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల్లో మరణాలు 59 వేలు దాటాయని గాజా ఆరోగ్య విభాగం సోమవారం తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి సాగిస్తున్న దాడుల్లో క్షతగాత్రుల సంఖ్య 1,42,135కు చేరుకుందని వివరించింది.
తక్షణమే హింస ఆగిపోవాలి
గాజాపై సాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని యూకే, ఫ్రాన్స్ తదితర 23 దేశాలు ఇజ్రాయెల్‌ను కోరాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను గౌరవించాలని హితవు పలికాయి. ఇందులో 20 యూరప్ దేశాలతోపాటు ఆ్రస్టేలియా, కెనడా, జపాన్ ఉన్నాయి. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గాజా పౌరుల అవస్థలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. నీరు, ఆహారం వంటి కనీస అవసరాలను తీర్చాలని కోరుతున్న పాలస్తీనా పౌరులు, ముఖ్యంగా చిన్నారులను అమానవీయంగా చంపడం ఆపాలని వారు కోరారు.