
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనుషుల్ని మెచ్చడం అత్యంత అరుదు. అందునా తనకు నచ్చని దేశాల అధ్యక్షులను వైట్‌హౌజ్‌కు పిలిపించుకుని మరీ అవమానించడం ఆయనొక అలవాటుగా మార్చుకున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఓ దేశ అధ్యక్షుడ్ని మెచ్చుకుంటే.. అది కూడా బెడిసి కొట్టింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ , దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. జెలెన్‌స్కీని తన ఓవెల్ ఆఫీస్‌లో మీడియా సమక్షంలోనే డిక్టేటర్(నియంత) అంటూ తిట్టిపోశారు. అలాగే.. రామఫోసా ముందు ఓ వీడియో ప్రదర్శించి.. సౌతాఫ్రికాలో తెల్లవాళ్లను ఊచకోతలు కోస్తున్నారంటూ ఏకంగా ఓ తప్పుడు వీడియోను ప్రదర్శించి మరీ విమర్శలు గుప్పించారు.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మినహా ఆయన ప్రత్యేకంగా ఎవరినీ ప్రశంసించింది లేదు. తాజాగా లిబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొకాయ్‌పై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ఇప్పటిదాకా వైట్‌హౌజ్‌కు వచ్చిన ఏ నేత కూడా ఇంత అందంగా ఆంగ్లంలో మాట్లాడలేదంటూ.. Such good English అని ట్రంప్ వ్యాఖ్యానించారు. Where did you learn to speak so beautifully? అంటూ ఆరా తీశారు. తనకు తెలిసిన అమెరికన్ల కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడారంటూ కితాబిచ్చారు.
Trump to Liberia’s President “Your English is beautiful better than some Americans I know.” 🇱🇷😂
FYI: English is Liberia’s official language.#Trump #Liberia #JosephBoakai #Politics pic.twitter.com/WidIjSWA3N— A.S (@DHAS013) July 10, 2025
అయితే ఈ పొగడ్త వివాదాస్పదంగా మారింది. లిబీరియా అధికార భాష ఆంగ్లమే. పైగా బొకాయ్ లిబీరియాలోనే విద్యనభ్యసించారు. దీంతో ఆఫ్రికా అంతటా ట్రంప్ వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఆఫ్రికన్ యూత్ యాక్టివిస్ట్ ఆర్చీ హారిస్ స్పందిస్తూ.. మా దేశం ఆంగ్ల భాష మాట్లాడే దేశం. ఈ ప్రశ్నను ప్రశంసగా కాక, అవమానంగా భావించాను అని అన్నారు.
దక్షిణాఫ్రికా రాజకీయ నాయకురాలు వెరోనికా మెంటే స్పందిస్తూ.. ట్రంప్ అలా అన్నాక కూడా బొకాయ్ ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోలేదు? అని ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై వైట్ హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యను హృదయపూర్వక ప్రశంసగా, ట్రంప్ ఆఫ్రికా దేశాలకు మిత్రుడిగా అభివర్ణించింది.
లిబీరియా.. 1822లో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా స్థాపించబడింది. 1847లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆంగ్ల భాష అధికార భాషగా ఉంది, కానీ అనేక స్థానిక భాషలు కూడా మాట్లాడబడతాయి.