
ట్రంప్ చట్టంతో భారతీయులకు ఇక్కట్లే
వేలాది మంది బీమా రక్షణకు దూరం
విద్యార్థులు మొదలు గ్రీన్‌కార్డ్‌దారుల దాకా అందర్లోనూ గుబులే
అమెరికాను మరింత గొప్ప (బిగ్)గా, మరింత చూడచక్కగా (బ్యూటిఫుల్)గా తీర్చిదిద్దుతానంటూ ట్రంప్ తెచ్చిన ‘ది వన్ బిగ్, బ్యూటిఫుల్’చట్టం అక్కడి భారతీయులకు పెను సమస్యగా మారేలా ఉంది. వలస, వలసేతర వీసాల ద్వారా అమెరికాలో కాలుపెట్టిన మనవాళ్లకు ఈ చట్టం సమస్యల స్వాగతం పలకడం ఖాయంగా కన్పిస్తోంది. ముఖ్యంగా వేలాది భారతీయ అమెరికన్లకు వైద్య బీమా రక్షణ ఛత్రాన్ని ఈ చట్టం దూరం చేస్తోంది.
శాశ్వత స్థిరనివాస హోదా అయిన గ్రీన్‌కార్డ్‌దారులకు కూడా ‘బ్యూటిఫుల్’కష్టాల నుంచి ఊరట దక్కడం లేదు. హెచ్–1బీ వీసాదారుతో పాటు విద్యార్థి వీసాలపై అమెరికాకు వచ్చిన భారతీయులకు కూడా కొత్త చట్టం సమస్యాత్మకంగా మారుతోంది. ఏకంగా 20 లక్షల మంది భారత అమెరికన్లు దీని దెబ్బకు ఆరోగ్య బీమా సౌకర్యం కోల్పోయారు.
ఖజానాపై ఏకంగా 1.7 లక్షల కోట్ల డాలర్ల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కొత్త చట్టం తేవడం తెలిసిందే. ఉచితంగా, అన్యాయంగా వైద్య సేవలు, సాయం వాళ్లకు మాత్రమే కోతలు పెడతానని అమెరికా పౌరులకు ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థి వీసాపై అమెరికా వర్సిటీల్లో చదివే మనవాళ్లకు ఇన్నాళ్లూ కొనసాగిన వైద్య బీమా సదుపాయం ఎత్తేశారు.
అది లేకపోతే అమెరికాలో వైద్య ఖర్చులకు చుక్కలు కనిపిస్తాయి. తమకిది పెను ఆర్థిక భారమేనని న్యూజెర్సీలోని రూత్‌జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కాలేజీలో ఎలాగోలా నెట్టుకొస్తాం. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడుతుంది. ఆ వెంటనే ఉద్యోగం రాకుండా మరిన్ని ఇక్కట్లు తప్పవు’’అంటూ వాపోయారు.
శరణార్థులకు అరిగోస!
శరణార్థులుగా అమెరికాకు వచ్చిన వారిలో అత్యధికులు మెడిక్‌ఎయిడ్, ఎమర్జెన్సీ హెల్త్‌కేర్ ప్రోగ్రాంతోనే లబ్ధి పొందుతున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) గణాంకాల ప్రకారం 2020లో 6,000 మంది భారతీయులు శరణార్థి హోదా పొందారు. 2023లో ఆ సంఖ్య 8 రెట్లు పెరిగి 51,000కు చేరింది. దాంతో శరణార్థుల్లో కొందరికే మెడిక్‌ఎయిడ్‌ను పరిమితం చేయాలని ‘బ్యూటిఫుల్’చట్టంలో పేర్కొన్నారు. మిగతా వారంతా వైద్య బీమాకు దూరం కానున్నారు.
కనీసం 80,000 మంది భారత శరణార్థులకు బీమా సౌకర్యం దూరమవుతుందని చెబుతున్నారు. విద్యార్థులనూ కలుపుకుంటే కనీసం లక్ష మందికి పైగా భారతీయులు బీమాకు దూరమవుతున్నారు. బరాక్ ఒబామా హయాంలో గ్రీన్‌కార్డ్‌దారులు, శరణార్థులు, గృహహింస బాధితులు, హెచ్–1బీ వీసాదారులు, ఎఫ్–1 వీసా ఉన్న విద్యార్థులు ‘ఒబామాకేర్’పథకంలో భాగంగా వైద్య బీమా పొందేవాళ్లు. దీనికింద కుటుంబాలు, చిన్న వ్యాపారులకూ బీమా అందేది.
వారికీ రెడ్ అలర్టే!
గ్రీన్ కార్డు కేవలం శాశ్వతస్థిర నివాస హామీ మాత్రమే. అది లభించినంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఇవ్వరు. ట్రంప్ సర్కారు సరిగ్గా ఇదే పాయింటు పట్టుకుంది. పౌరసత్వంలేని వాళ్లకు మెడిక్‌ఎయిడ్ తెగ్గోయాలని చట్టంలో పేర్కొంది. తద్వారా గ్రీన్‌కార్డ్‌దారుల్లో అత్యధికులకు వైద్య బీమా ఎత్తేస్తోంది. మిగతా వారి అర్హతను కూడా ప్రతి ఆర్నెల్లకోసారి సమీక్షిస్తారు. ఆ లెక్కన త్వరలో వారికీ బీమా ఎత్తేయడం ఖాయమంటున్నారు.
‘నేను న్యూజెర్సీలో ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్నా. నేను, నా భార్య కలిసి ఏటా 27,000 డాలర్లు పన్నుగా కడుతున్నాం. అయినా ట్రంప్ ప్రభుత్వం దృష్టిలో మేం తక్కువ పన్ను కడుతున్నట్టే లెక్క. నెలకు 450 డాలర్లున్న నా ఒక్కని నెలవారీ వైద్య బీమా ప్రీమియమే కొత్త చట్టంతో 1,200 డాలర్లకు పెరగనుంది’’అని సుహాస్ ప్రతాప్ అనే తెలుగు ఎన్నారై వాపోయారు. ఆయన హెచ్–1బీ వీసా మీద అమెరికాకు వచ్చారు.
– సాక్షి, నేషనల్ డెస్క్