
తక్షణమే మలమూత్రాల పరీక్షలు
సెన్సార్లు, ఏఐ ఉన్న మొబైల్ యాప్
అప్పటికప్పుడు ‘గట్ హెల్త్’ రిపోర్ట్ సిద్ధం
సాక్షి, సాగుబడి: కృత్రిమ మేధ.. ఇప్పుడు టాయిలెట్‌ని కూడా అత్యా ధునిక స్మార్ట్ లేబొరేటరీగా మార్చేసింది! మనకు మున్ముందు రాగల జబ్బుల్ని ముందుగానే పసిగట్టే ఆధారపడదగిన గట్ హెల్త్ డేటాను.. చిటికెలో మొబైల్ యాప్‌లోకే అప్‌లోడ్ చేసేస్తాయట ఈ సూపర్ స్మార్ట్ ఏఐ టాయిలెట్లు!అన్ని రంగాల మాదిరిగానే రోజువారీ వ్యక్తిగత ఆరోగ్య సమాచార సేకరణ వ్యవస్థ కూడా అత్యాధునికతను సంతరించుకుంటోంది.
పొద్దున్నే నిద్ర లేవగానే చిటికెలో ఆనాటి తాజా వ్యక్తిగత ఆరోగ్య గణాంకాలను అందించే మొబైల్ యాప్‌లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సరికొత్త కొనసాగింపుగా వచ్చిందే స్మార్ట్ మరుగుదొడ్డి!
కూర్చుని లేచేలోపే..
మలమూత్ర విసర్జన చేస్తున్నంతటి సేపట్లోనే సెన్సార్లు, కృత్రిమ మేధ విశ్లేషణ పరికరాలు.. మల మూత్రాల రంగు, రూపు, నాణ్యతలను బట్టి ఆరోగ్య స్థితిగతుల్ని ఇట్టే పసిగట్టేస్తాయి. కడుపులో సూక్ష్మజీవరాశి ఎంత ఆరోగ్యంగా ఉందో, ఏదైనా తేడా ఉంటే దాని వల్ల ఏయే వ్యాధులు ముసురుకునే ప్రమాదం పొంచి ఉందో కూడా తేల్చి చెప్పేస్తాయి.
కమోడ్ మీద కూర్చొని, లేచే సమయానికే ఈ సమస్త సమాచారం మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసేస్తాయి ఈ ఏఐ టాయిలెట్లు! ప్రత్యక్ష పరీక్షల మాదిరిగా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో ఈ పరీక్షల ఫలితాలు ఉంటాయని అనుకోలేం. కానీ, కొలరెక్టల్ కేన్సర్ వంటి అనేక జబ్బుల్ని అత్యంత తొలి దశలోనే గుర్తించటంలో సూపర్ స్మార్ట్ టాయిలెట్ల పాత్రను తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు.
జపాన్‌లో తయారీ
స్మార్ట్ టాయిలెట్ల తయారీలో జపాన్‌కు చెందిన టోటో టాయిలెట్స్ సంస్థ ఒక ముందడుగు వేసింది. మరుగుదొడ్డి కమోడ్‌కు అమర్చిన సెన్సార్.. మలం రంగు, ఆకారం, పరిమాణం వంటి వివరాలను అందిస్తుంది. బార్‌కోడ్ స్కానర్ మాదిరిగా క్షణాల్లో రిపోర్టు ఇస్తుంది. మనిషి కూర్చోగానే సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఎల్‌ఈడీ లైటు వెలుతురులో మలాన్ని సెన్సార్ పరీక్షిస్తుంది.
సేకరించిన సమాచారాన్ని అప్పటికప్పుడే స్మార్ట్‌ఫోన్ యాప్‌కు పంపిస్తుంది. మల విసర్జన చేసిన ప్రతిసారీ సేకరించిన సమాచారంతో కూడిన స్టూల్ కేలండర్‌ను ఈ యాప్ భద్రపరుస్తుంది. ట్రెండ్ ఎలా ఉంది.. ఏమైనా తేడాలున్నాయా.. ఉంటే, వాటిని సరిదిద్దుకోవటానికి జీవన శైలిని ఎలా మార్చుకోవాలో కూడా సూచనలిస్తుంది. సుఖ మల విసర్జనకు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది కూడా.
ప్రత్యేక స్టార్టప్‌లు
కృత్రిమ మేధతో కూడిన బాత్రూమ్ టెక్నాల జీలను అందించే స్టార్టప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని ఆస్టిన్ నగరంలోని త్రోన్ అనే స్టార్టప్ మల మూత్రాల బాగోగులను విశ్లేషించేందుకు ఏఐ టాయిలెట్ కెమెరాను రూపొందించింది. టాయిలెట్‌ను ఉపయోగించే వ్యక్తి జీర్ణవ్యవస్థ పనితీరు, మూత్ర విసర్జన తీరు ఎలా ఉంది? ఆ వ్యక్తి సరిపడా నీరు తాగుతు న్నారా లేదా?.. వంటి రియల్ టైమ్ డేటాను కూడా మొబైల్ యాప్‌కు పంపుతుంది.
ఎక్కువ మంది వాడే టాయిలెట్లలో కూడా ప్రతి యూజర్ గట్ ప్రొఫైల్‌ను త్రోన్ ఏఐ వ్యవస్థ సిద్ధం చేస్తుంది. టాయిలెట్‌ను వాడుతున్న వ్యక్తి ఎవరో బ్లూటూత్ ద్వారా గుర్తించి కచ్చితమైన వివరాలను ఎవరివి వాళ్లకు అందిస్తుంది. రోజువారీ బాత్రూమ్ అలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య సమాచార వ్యవస్థను సంపన్నం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.