తొలిసారిగా దోమల సంతతిని గుర్తించిన స్థానికులు
విస్తృతస్థాయిలో వ్యాపించాయో లేదో తేల్చనున్న కీటక నిపుణులు
దోమలతో సంక్రమించే వ్యాధులపై స్థానికుల్లో మొదలైన భయాందోళనలు
న్యూఢిల్లీ: మశకం. దీనికి దోమ అని మరో పేరు కూడా ఉంది. భారత్‌లో ఏ వీధిలో ఏ మూలన చూసినా వేలాదిగా కనిపించి కసితీరా కాటువేసే ఈ దోమలు ఇప్పటిదాకా ఐస్‌ల్యాండ్‌లో లేవు. ఐస్‌ల్యాండ్ దేశ చరిత్రలో తొలిసారిగా దోమలను చూశామని గతవారం ఓ వ్యక్తి వెల్లడించడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఇప్పటిదాకా ఐస్‌లాండ్ వాసుల దరిచేరలేదు.
ఇకపై తమ దేశంలోనూ దోమలు తిష్టవేస్తే వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఉరవడి తప్పదని స్థానికులు భయపడిపోతున్నారు. సాధారణంగా యూరప్ ఉత్తర ప్రాంతాల దాకా ఈ దోమలు ఉంటాయిగానీ ఐస్‌ల్యాండ్‌లో లేవు. దోమలను తమ ఇంట్లో గుర్తించామని గత వారం ఒక వ్యక్తి ప్రకటించారు. సంబంధిత దోమల ఫొటో లను తీసి స్థానిక పారిశుద్ధ్య విభాగ అధి కారులకు పంపించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటిని క్యూలిసెటా యాన్వలాలా జాతి దోమలుగా గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చాయి?
ఈ అంశంపై నేషనల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఐస్‌ల్యాండ్‌లో కీటక విభాగ నిపుణుడు డాక్టర్ మ్యాథియస్ ఆల్‌ఫ్రెడ్‌సన్ మాట్లాడారు. ‘‘ విదేశాల నుంచి వచ్చిన సరకు రవాణా లేదా వాణిజ్య నౌకలు లేదా షిప్పింగ్ కంటైనర్‌ల కారణంగా ఈ దోమలు ఐస్‌ల్యాండ్‌లోకి వచ్చి ఉంటాయి. క్యూలిసెటా దోమలు కాస్తంత చల్లని ప్రాంతాల్లోనూ మనగలవు. వాతావరణ మార్పులు, భూతాపోన్నతి వంటి దారుణ పరిస్థితులు కారణంగా ఐస్‌ల్యాండ్ సైతం వేడెక్కుతుంది. దీంతో ఇక్కడ తిష్టవేసిన వేడి వాతావరణమే, వాతావరణంలో అధిక తేమ, ఆర్థ్రత, వర్షభావ పరిస్థితులు సైతం కొత్తగా దోమ ఈ దేశంలో మనుగడ సాగించడానికి కారణం అయి ఉండొచ్చు’’ అని ఆయన విశ్లేషించారు.
ఎవరు కనిపెట్టారు?
ఐస్‌ల్యాండ్‌లోని కిడాఫెల్ అనే గ్రామంలో ద్రాక్షతోట పండించే బిజోర్న్ హజాల్ట్‌సన్‌కు కొత్తతరహా కీటకాలను పరిశీలించడమంటే ఎంతో ఇష్టం. గత ఆరేళ్లుగా తన తోటలో అధికమైన చిమ్మట పురుగులను త్వరగా పట్టుకునేందుకు ఒక వస్త్రానికి తీపి, రెడ్‌వైన్‌ల మిశ్రమాన్ని పూసి ఆ వస్త్రంలో చిక్కుకుపోయే పురుగులను గమనించడం ఓ వ్యాపకంగా పెట్టుకున్నాడు. అక్టోబర్ 16వ తేదీన కొత్త రకం కీటకం కనిపించడంతో అది ఖచ్చితంగా దోమ అని భావించి వాటిని వెంటనే కీటక నిపుణుడు మ్యాథియస్‌కు పంపించారు. విషయం తెల్సి ఆశ్చర్యానికి గురైన ఆయన వెంటనే బిజోర్న్ ఇంటికి చేరుకుని అక్కడ దోమల జాడను గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లి అధ్యయనం చేసి వాటిని క్యూలిసెటా యాన్వలాలా రకం దోమలుగా గుర్తించారు. ఆడ, మగ దోమలనూ విస్తరిస్తున్నట్లు నిర్ధారించారు. ఈసారి ఐస్‌ల్యాండ్‌లో వసంతకాలంలో విపరీతంగా ఎండ కాయడంతో దోమల సంతతి పెరిగిందని ఆయన విశ్లేషించారు.


