యుగాంత రచయిత | Sakshi Editorial On Laszlo Krasznahorkai winning Nobel Prize | Sakshi
Sakshi News home page

యుగాంత రచయిత

Oct 13 2025 12:36 AM | Updated on Oct 13 2025 12:36 AM

Sakshi Editorial On Laszlo Krasznahorkai winning Nobel Prize

ఆధునిక యూరప్‌ సాహిత్యంలోనైనా, ఏ తరపు యూరప్‌ సాహిత్యంలోనైనా విశిష్ట స్థానం ఉన్న హంగెరీ రచయిత లాస్లో క్రాస్‌నాహోర్‌కైయేను ఈ యేటి సాహిత్య నోబెల్‌ పురస్కారం వరించింది. ‘ప్రళయ భయాల మధ్యలోనూ కళాశక్తిని తిరిగి ధ్రువీకరించే... ఆకర్షణీయమైన, దూరదృష్టి గల సాహిత్య కృతుల సమాహారానికిగానూ’ 1954లో జన్మించిన ఈ 71 ఏళ్ల ‘హంగేరియన్‌ రుషి’కి ఈ గౌరవం దక్కింది. 

తన తొలి నవల ‘సాటాన్‌టాంగో’(1985)కు మూడు దశాబ్దాల తర్వాత వెలువడిన ఆంగ్లానువాదానికిగానూ 2015లో ‘మ్యాన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’ అందుకున్న లాస్లో సరిగ్గా దశాబ్దం తర్వాత మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడే ఆయన ‘ద మెలంకలీ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ (1989), ‘వార్‌ అండ్‌ వార్‌’ (1999), ‘బారన్‌ వెంక్‌హెయిన్స్‌ హోమ్‌కమింగ్‌’ (2016) లాంటి ఇతర పోస్ట్‌మాడర్న్‌ నవలలు రాశారు.

కథకుడు కూడా అయిన లాస్లో క్రాస్‌నాహోర్‌కైయే ప్రధానంగా హంగేరియన్‌ భాషలోనూ, చాలాకాలంగా నివాసం ఉండటం వల్ల జర్మన్‌లోనూ రాస్తారు. ఆయన సాహిత్యంలో ప్రపంచం వల్ల గాయపడిన మనుషులు కనిపిస్తారు. భయ పీడనలను వాళ్లు తప్పించుకోలేరు. సామాజిక అభద్రత, అశాంతి, భరించలేని ఉక్కపోత, నియంతృత్వపు అరాచకాల ఈ అపసవ్య ప్రపంచంలో జరిగే కర్కశ పోరాటాలను ఆయన చిత్రించారు. 

అందానికీ అవినీతికీ, అమాయకత్వానికీ కపటానికీ, బలహీనతకూ మొరటు బలానికీ మధ్య జరిగే ఎడతెగని పోరు; ప్రతి ఎత్తునూ ఒక అగాథానికి లాగే, ప్రతి స్వర్గాన్నీ ఒక నరకానికి నేలకూల్చే దారుణాలు ఆయన వస్తువులు. అందుకే అమెరికన్‌ విమర్శకురాలు సూసన్‌ సోంటాగ్‌ ఆయన్ని యుగాంత సాహిత్యపు గురువుగా అభివర్ణించారు. ఆయన కళ ఎల్లప్పుడూ అసంబద్ధతకు ఆతిథ్యంగా నిలుస్తుంది– ప్రపంచం తానే ఒక వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, దయలేని ప్రతిద్వంద్విగా మారే మార్గాలకు సదా తెరిచి ఉంటుందని వ్యాఖ్యానిస్తారు బ్రిటిష్‌ రచయిత ఆడమ్‌ థర్ల్‌వెల్‌.

కాఫ్కా ‘ద క్యాజిల్‌’, దోస్తోవ్‌స్కీ ‘ది ఇడియట్‌’ను అభిమానించే లాస్లో ఎన్నడూ రచయిత కావాలని అనుకోలేదు. 1970ల్లో ఆయన పాస్‌పోర్టును కమ్యూనిస్టు అధికారులు జప్తు చేశారు. దానివల్ల బొగ్గు గని కార్మికుడిగా పనిచేశారు. ఆవుల కొట్టాలకు రాత్రుళ్లు కావలి కాశారు. బార్లలో పియానో వాయించారు. గ్రామాల్లో పేదలతో కలిసి బతికారు. వీధుల్లోని జన భాషను ఒంటబట్టించుకున్నారు. మూడు నాలుగు నెలలకోసారి కొత్త పనులు వెతుక్కుంటూ తిరిగారు. ఈ అశాశ్వత ప్రపంచానికి కళ ఒక్కటే అతివిశిష్టమైన ప్రతిస్పందన అని నమ్మి రచనా వ్యాసంగం వైపు మళ్లారు. 

లాస్లో లాగే రాజ్య వ్యవస్థ బాధితుడైన హంగెరీ దిగ్దర్శకుడు బేలా టార్‌ ఆయనతో జట్టు కట్టడం యావత్‌ ప్రపంచ సినిమాకే మేలు చేసింది. బేలా టార్‌ను బేలా టార్‌గా నిలబెట్టిన సినిమాల రచయితగా లాస్లో పనిచేశారు. ‘డామ్నేషన్‌’, ‘ద లాస్ట్‌ బోట్‌– సిటీ లైఫ్‌’, ‘వెర్క్‌మెయిస్టర్‌ హార్మనీస్‌’, ‘ద ట్యూరిన్‌ హార్స్‌’తో పాటు ఏడు గంటల నిడివుండే ‘సాటాన్‌టాంగో’ వీరి కాంబినేషన్లో వెలువడ్డాయి. నలుపు తెలుపుల్లో తీయడం,దీర్ఘ షాట్లు, మౌనం మాట్లాడటం, ఏమీ జరగకుండానే ఎంతో జరిగినట్టనిపించడం వీటి ప్రత్యేకత.

లాస్లో వచనంలో అన్నీ గుక్క తిప్పుకోలేని దీర్ఘ వాక్యాలే. ఫుల్‌స్టాపులు దేవుడికి సంబంధించినవంటారాయన. గుర్రాలు, గ్రహణాలు, తిమింగళాలు, ఇంకా మానవ ఉనికితో సహా ఈ విశ్వంలోని ప్రతిదాన్నీ అందమైనదిగా, అద్భుతమైనదిగా విశ్వసించే సాధారణ మనుషులు ఆయన సాహిత్యంలో ఆశావహ ప్రపంచపు ప్రతినిధులుగా కనబడతారు. కానీ ఆ ఆశ అనేది ఎప్పటికీ భవిష్యత్తుకు సంబంధించినదే; అలాంటి భవిష్యత్తుతో మనల్ని మనం భ్రమింపజేసుకుంటాం, ఆ భవిష్యత్తు ఎప్పటికీ రాదు; ఉన్నది వర్తమానం మాత్రమే అంటారు బౌద్ధ తాత్విక చింతనను ఇష్టపడే లాస్లో. యుగాంతం ఎప్పుడో సంభవించేది కాదనీ, అది ఇక్కడే ఉంది; అది సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రక్రియ అనీ పాఠకులను అప్రమత్తం చేస్తారు. ఈ చీకటి యుగంలో బతకడానికి చదవడం మరింత శక్తినిస్తుందంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement