న్యూఢిల్లీ: ‘శాంతి బహుమతి’ కోసం తాపత్రయపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల త్వరలో నెరవేరబోతోంది. అయితే అది నోబోల్ నుంచి కాదు. మరో ప్రముఖ సంస్థ ఆయనను ‘శాంతి బహుమతి’తో సత్కరించనున్నట్లు సమాచారం. పైగా ఈ పురస్కారం అందుకునే తొలి ప్రముఖుడు ట్రంప్ అంటూ ఆ సంస్థ అధ్యక్షుడు పరోక్షంగా ప్రకటించారు. ఇంతకీ అది ఏ సంస్థ?.. ఎందుకు ట్రంప్‌కు శాంతి బహుమతి ఇస్తున్నారనే వివరాల్లోకి వెళితే..
అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడా సమాఖ్య(ఫిఫా) త్వరలో తమ సంస్థ నుంచి ‘శాంతి బహుమతి’ని అందించాలని నిర్ణయించింది. దీనికి ‘ఫిఫా శాంతి బహుమతి’గా నామకరణం చేసింది. ప్రపంచంలో శాంతి, ఐక్యతల కోసం విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి, వారికి ‘ఫిఫా’ ఈ ‘శాంతి బహుమతి’ని ప్రదానం చేయనుంది. 2025, డిసెంబర్ ఐదు (శుక్రవారం)న వాషింగ్టన్ డీసీలో జరిగే 2026 ప్రపంచ కప్ డ్రా సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో తన చేతుల మీదుగా ఒక ప్రముఖునికి ‘ఫిఫా శాంతి బహుమతి’ని అందించనున్నారు.
‘ఫిఫా’ తెలిపిన వివరాల ప్రకారం శాంతి కోసం విశేషంగా కృషిచేసి, ప్రపంచ ప్రజలను ఏకంచేసిన ప్రముఖుడు ఈ బహుమతిని అందుకోనున్నారు.
‘అస్థిరత, విభజనలు పెరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో, సంఘర్షణలను అంతం చేయడానికి, శాంతియుత స్ఫూర్తితో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసే వారి అత్యుత్తమ సహకారాన్ని గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఇన్ఫాంటినో అన్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధం కలిగిన ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో.. అమెరికా బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్బంగా విలేకరులు.. ‘ఈ బహుమతి తొలిసారిగా ట్రంప్ అందుకోబోతున్నారా?’ అని అడిగారు. దీనికి సమాధానంగా ఆయన ‘డిసెంబర్ 5న మీరంతా చూస్తారు’ అని అన్నారు. బిజినెస్ ఫోరమ్‌లో ట్రంప్ ప్రసంగం అనంతరం ఇన్ఫాంటినో అదే వేదికపై మాట్లాడారు. ట్రంప్‌ను ప్రపంచ శాంతి సాధనలో ఛాంపియన్‌గా తాను చూస్తున్నానని ఇన్ఫాంటినో పేర్కొన్నారు. గాజాలో శాంతి ఒప్పందం కోసం ట్రంప్ చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఆయన ఖచ్చితంగా అర్హుడు అని ఇన్ఫాంటినో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో రాశారు.
ఇది కూడా చదవండి: Air India Crash: ‘పైలట్‌ను నిందించొద్దు’: సుప్రీంకోర్టు


