వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత సంతతికి చెందిన తన సతీమణి ఉషా వాన్స్‌ను తిట్టేవారిపై జేడీ వాన్స్.. అసహనం వ్యక్తం చేశారు. ఉషను జాతిపరంగా కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు వాన్స్ కౌంటరిచ్చారు.
ఇటీవల తన పాడ్‌కాస్ట్‌లో ఉషను జాతిపరంగా కించపరిచేలా.. ఉపాధ్యక్షుడిని జాతి ద్రోహిగా పేర్కొంటూ నిక్ విమర్శలు చేశారు. దీనిపై వాన్స్ స్పందించారు. ఈ సందర్బంగ వాన్స్ మాట్లాడుతూ.. ‘నేను ఒకటే స్పష్టం చేయదలుచుకున్నా. నా భార్యపై విమర్శల దాడి చేసేవారు.. జెన్ సాకీగానీ, నిక్ ఫ్యూయెంటెస్‌గానీ.. వారు ఎవరైనాగానీ అశుద్ధం తినొచ్చు. అమెరికా ఉపాధ్యక్షుడిగా అది నా అధికారిక విధానం. ప్రజలను జాతిపరంగా, సంస్కృతిపరంగా జడ్జ్ చేసేవారిపట్ల నా వైఖరి ఇలాగే ఉంటుంది. వారు యూదులైనా, శ్వేతజాతీయులైనా అంతే. మనం అలా వ్యవహరించకూడదు’ అని స్పష్టం చేశారు.
ఉద్యోగాలకు క్రైస్తవంతో లింకుపై విమర్శలు
ఇక, అంతకుముందు.. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు, ఉపాధికి, మతానికి ముడిపెడుతూ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా తాలూకు నిజమైన క్రైస్తవ గుర్తింపు కేవలం వ్యక్తిగత విశ్వాసాలకే పరిమితమైనది కాదు. ఈ దేశ ఉపాధికి, ముఖ్యంగా హెచ్–1బీ వీసాలకు కూడా సంబంధించినది. అమెరికా కంపెనీలు మూడో ప్రపంచ దేశాల నుంచి కారుచౌకగా ఉద్యోగులను దేశంలోకి గుమ్మరించడం సరికాదు. వ్యక్తి కుటుంబం ఎంత ముఖ్యమో, దేశ క్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తోందో పూర్తి అవగాహన కలిగివుండటం కూడా అంతే ముఖ్యం. అది మన కనీస బాధ్యత అంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారు.
‘ఇక్కడి ఉద్యోగాలను దేశీయులకు కట్టబెడుతున్న కంపెనీలకు జరిమానాలు విధిస్తున్నాం. ఎందుకంటే సొంత దేశంలో మంచి ఉద్యోగం చేయాలనే ఎవరికైనా ఉంటుంది. అమెరికన్ల ఆ కలలకు ఈ కంపెనీల తీరు తూట్లు పొడుస్తోంది అని వాన్స్ ఆరోపించారు. హెచ్–1బీ వీసాలకు పరిమితులు విధించేందుకు అదే కారణం. అమెరికా ఎన్నటికీ క్రైస్తవ దేశమే. ఆ విశ్వాసమే మనకు దిక్సూచి’ అన్నారు. వాన్స్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పలువురు అమెరికన్లు వారిని స్వాగతిస్తుండగా, చాలామంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు.


