జెరూసలెం: ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర బెత్లెహాం రెండేళ్ల అనంతరం క్రిస్మస్ శోభతో మెరిసిపోతోంది. వేలాది విశ్వాసులు ఈ పవిత్ర చరిత్ర నగరానికి బారులు తీరుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రెండేళ్లుగా ఇక్కడ క్రిస్మస్ సంబరాలు పెద్దగా జరగకపోవడం తెలిసిందే. తాత్కాలిక కాల్పుల విరమణతో ప్రస్తుతానికి కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొనడంతో ఈ క్రిస్మస్ కు బెత్లెహాం భారీ స్థాయిలో ముస్తాబవుతోంది. చారిత్రక మాంగర్ స్క్వేర్ లో సుదూరాలకు కూడా కనిపించేంతటి భారీ క్రిస్మస్ ట్రీ అందరినీ అలరిస్తోంది.
కార్డినల్ పియర్ బటిస్టా పిజాబెల్లా సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. విశ్వాసులు సంప్రదాయం మేరకు ఆడుతూ పాడుతూ నృత్యగానాలు చేస్తూ జెరూసలెం నుంచి ప్రదర్శనగా బెత్లెహాం చేరుకున్నారు. అయితే ఈసారి విదేశీయులు మాత్రం అతి తక్కువగా కనిపించారు. క్రిస్మస్ సీజన్లో మామూలుగా జరిగే వ్యాపారం లేక ఈసారి స్థానిక ముస్లింల దుకాణాలు దిగాలుపడి కనిపిస్తున్నాయి. బెత్లెహాం కు పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. యుద్ధం దెబ్బకు రెండేళ్లుగా అది దాదాపుగా నిండుకుంది. యుద్ధ విరామం నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం మళ్లీ కాస్త కళకళలాడుతోందని స్థానికులు అంటున్నారు. వెస్ట్ బ్యాంక్ లోని 30 లక్షల జనాభాలో క్రైస్తవులు 2 శాతం ఉండరు.


