హెచ్చు నైపుణ్యం, వేతనం
ఇవే వీసా జారీకి కొత్త ప్రాతిపదిక
ట్రంప్ సర్కారు కీలక నిర్ణయం
భారతీయులకు శరాఘాతమే
న్యూయార్క్/వాషింగ్టన్: హెచ్–1బీ వీసాలపై కొంతకాలంగా కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు వాటి కట్టడి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ వీసాదారుల ఎంపికకు పాటిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మంగళవారం ప్రకటించింది. ఇకపై అత్యధిక నైపుణ్యం, వేతనం ఉన్న వారికే ఆ వీసాల జారీలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టంచేసింది. దీంతో నైపుణ్యం తక్కువగా ఉన్న విదేశీఉద్యోగుల రాక తగ్గిపోయి ఆ ఉద్యోగాలు అమెరికన్లకు దక్కే అవకాశముంది. హెచ్–1బీ వీసాల జారీని ఇకపై యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్విసెస్(యూఎస్‌సీఐఎస్) ద్వారా చేపట్టనుంది. ‘‘ఇప్పటిదాకా కొనసాగిన కంప్యూటరైజ్డ్ హెచ్–1బీ వీసా లాటరీ వ్యవస్థ లోపభూయిష్టంగా తయారైంది.
దీనిని కంపెనీలు ఎంతగానో దుర్వినియోగం చేశాయి. విదేశీ ఉద్యోగులను కారుచవగ్గా తీసుకొచ్చి అమెరికాలో పని చేయించుకున్నాయి. ఫలితంగా ఐటీ తదితర ఉద్యోగాల్లో అమెరికన్లకు చాలా అన్యాయం జరిగింది. ఇకపై దీన్ని సరిదిద్దుతాం. ఇకపై నాలుగు రకాలుగా వేతనాలను వర్గీకరించి దానికనుగుణంగా హెచ్–1బీలను జారీచేస్తాం. ఎంట్రీ లెవల్ అభ్యర్థులు(1), అర్హత సాధించిన అభ్యర్థులు(2), అనుభవం ఉన్న అభ్యర్థులు(3), అత్యధిక నైపుణ్యమున్న అభ్యర్థులు(4)గా దరఖాస్తులను విభజించి ఆ మేరకే హెచ్–1బీ వీసాలను జారీచేయాలని ప్రతిపాదించాం. ఈ ప్రతిపాదనలను ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ)కి సమీక్ష కోసం పంపించాం. అక్కడ ఆమోదం పొందాక ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురిస్తాం.
ఆ తర్వాత 30 రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి’’ అని యూఎస్‌సీఐఎస్ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ స్పష్టం చేశారు. హెచ్–1బీ వీసా విధానాన్ని సమూలంగా సంస్కరించాలన్న ట్రంప్ ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే అన్ని స్థాయిల్లో అర్హులకు వీసాలు లభించేలా చూసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన ముక్తాయించారు. కొత్త విధానం వచ్చే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. అమెరికాలో ఉన్నతోద్యోగాలు చేయాలన్న విద్యాధిక భారత యువత, ముఖ్యంగా ఐటీ జీవుల కలలపై ఈ నిర్ణయం మరిన్ని నీళ్లు చల్లింది.


