పాకిస్తాన్‌కు సిగ్గుపడడం నేర్పలేం
దాడుల నుంచి ప్రజలను కాపాడుకోవడం పాపులిజం అవుతుందా?
పాకిస్తాన్‌పై న్యాయ విద్యార్థి విరాన్ష్ భానుశాలీ ఆగ్రహం
వాడీవేడిగా ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ యూనియన్ డిబేట్
లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ యూనియన్ డిబేట్‌లో భారత్, పాకిస్తాన్ విద్యార్థుల మధ్య వాడీవేడిగా సంవాదం జరిగింది. ప్రజలను మెప్పించి, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేస్తోందంటూ పాక్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని భారత విద్యార్థులు గట్టిగా తిప్పికొట్టారు. సిగ్గులేని దేశాన్ని సిగ్గుపడేలా చేయలేమని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఎద్దేవా చేశారు. నవంబర్ 27న ఈ డిబేట్ జరిగింది.
భారత్ తరపున న్యాయ విద్యార్థి విరాన్ష్ భానుశాలీ, దేవార్చన్ బెనర్జీ, సిద్ధాంత్ నాగ్రాత్, పాకిస్తాన్ తరఫున మూసా హర్రాజ్, ఇస్రార్ ఖాన్, అహ్మద్ నవాజ్ పాల్గొన్నారు. పాకిస్తాన్ మంత్రి మొహమ్మద్ రజా హయత్ హర్రాజ్ కుమారుడే మూసా హర్రాజ్. భారత్‌లో ఏం జరిగినా పాకిస్తాన్‌పై నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారని మూసా హర్రాజ్ ఆక్షేపించారు. ప్రేమికులు, భార్యాభర్తలు విడిపోయినా, అల్లరి మూక దాడి చేసినా దానికి పాకిస్తానే కారణం అంటే ఎలా? అని ప్రశ్నించారు.
ఇండియా పాలకులు ఎన్నికల్లో లబ్ధి కోసం పాకులాడుతున్నారని, అందుకోసం పాకిస్తాన్‌ను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దీనిపై విరాన్ష్ భానుశాలీ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. తన వాదనతో పాక్ ప్రతినిధులను కంగు తినిపించారు. డిబేట్‌కు సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వర్సిటీ అధికారులు అప్‌లోడ్ చేశారు. పాకిస్తాన్ దాషీ్టకాలపై విరాన్ష్ భానుశాలీ వాదన వైరల్‌గా మారింది. ఒకరకంగా పాకిస్తాన్‌ను ఆయన కడిగిపారేశారు. పాక్ అండతో భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద దాడులను ప్రస్తావించారు.
‘ఎలక్షనీరింగ్’ అనడం మూర్ఖత్వం
‘‘2008 నవంబర్ 26(26/11) దాడి నుంచి మా బంధువు తృటిలో తప్పించుకున్నారు. అప్పట్లో నేను స్కూల్లో చదువుకునేవాడిని. ముంబై నగరం మంటల్లో చిక్కుకోవడం టీవీలో చూశా. నా తల్లిదండ్రుల్లో ఆందోళలనను గమనించా. మూడు రోజులపాటు ముంబై ప్రజలకు నిద్రలేదు. 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 250 మందికిపైగా మరణించారు.
ఎన్నో విషాదాల నీడన నేను పెరగాల్సి వచి్చంది. పాకిస్తాన్ పట్ల ఇండియా వైఖరిని జనరంజకవాదం(పాపులిజం) అనడం సరైంది కాదు. ఈ డిబేట్‌లో మేము నెగ్గాలంటే గణాంకాలు కాదు.. క్యాలెండర్ ఉపయోగిస్తే సరిపోతుంది. 1993 మార్చి నెలలో మా ఇంటికి సమీపంలోనే దాడులు జరిగాయి. అప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. మూడేళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఓట్ల అవసరం వల్ల ఈ దాడులు జరగలేదు. భారత ఆర్థిక రాజధానిని దెబ్బకొట్టాలని దావూద్ ఇబ్రహీం, ఐఎస్‌ఐ కుట్రలు సాగించాయి. ఇది పాపులిజం కాదు.. భారత్‌పై జరిగిన యుద్ధమే.
26/11 దాడుల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సంయమనం పాటించింది. నిజంగా ఎన్నికల్లో నెగ్గాలనుకుంటే యుద్ధ విమానాలతో పాక్‌పై దాడులు చేసేది. శత్రువుకు బుద్ధిచెప్పకపోతే శాంతి సాధ్యమవుతుందా? అందుకే పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌లోని పఠాన్‌కోట్, ఊరీపై భారత సైన్యం దాడులకు దిగింది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్‌ను ‘ఎలక్షనీరింగ్’ అనడం మూర్ఖత్వం. అప్పుడు ఎన్నికలు లేవు. అలాంటప్పుడు ఎన్నికల్లో లాభపడడానికి దాడులు చేశారని ఎలా చెప్పగలరు? పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాలి్చచంపారు.
ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారని పర్యాటకులను అడగలేదు కదా! ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ భూభాగాలను భారత్ ఆక్రమించలేదు. ముష్కరులకు బుద్ధి చెప్పింది. ఇది పాపులిజం కాదు.. ప్రొఫెషనలిజం. ఉగ్రవాద దాడుల నుంచి ప్రజలను కాపాడుకోవడం పాపులిజం అవుతుందా? ప్రజలకు కనీసం తిండికూడా పెట్టలేని పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌ను బూచీగా చూపించి వారిని మభ్యపెడుతోంది. ప్రజల పేదరికాన్ని అధికారానికి నిచ్చెనగా వాడుకుంటోంది. భారత్ యుద్ధం కోరుకోవడం లేదు. పొరుగుదేశాలతో స్నేహాన్ని, వ్యాపారాన్ని కోరుకుంటోంది. భారతదేశ సహనాన్ని పాకిస్తాన్ పదేపదే పరీక్షిస్తోంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి’ అని భానుశాలీ తేల్చిచెప్పారు.


