మరో ఏడుగురు సైతం
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిన ఘటనలో లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ అహ్మద్ అల్–హదద్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లిబియా ప్రధాన మంత్రి అబ్దుల్ హమీద్ దిబేబాహ్ ధృవీకరించారు. మంగళవారం రాత్రి 8.30 నిమిషాలకు అంకారాలోని ఎసెన్‌బోగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫాల్కన్– 50 రకం ప్రైవేట్ బిజనెస్ జెట్ చిన్న విమానం టేకాఫ్ అయింది.
ఇందులో లిబియా సైన్యా ధ్యక్షుడు అలీ సహా నలుగురు సైనికాధికారులు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు. వీళ్లంతా తుర్కియేలో పర్యటన ముగించుకుని స్వదేశం పయనమయ్యారు. అయితే గాల్లోకి లేచిన కేవలం 40 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)తో విమాన సంబంధాలు తెగిపోయాయి. వెనువెంటనే 408 మంది సిబ్బందితో సహాయక, అన్వేషణ బృందాలు గాలింపు మొదలెట్టాయి. ఎయిర్‌పోర్ట్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని హేమన పరిధిలోని కెసిఖావ్ గ్రామ శివారులో విమాన శకలాలను గాలింపు బృందాలు గుర్తించాయి. విమానంలోని వారంతా చనిపోయి నట్లు నిర్ధారించాయి.


