ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌పై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందన్నారు. దాయాది పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. భవిష్యత్‌లో ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు.
చైనా సరిహద్దుల్లోని భద్రత గురించి ఆర్మీ చీఫ్ ద్వివేది తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్‌లో త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనం. దేశంలో భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్ సైనిక సంసిద్దంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా అది స్పష్టమైంది. జమ్ము కశ్మీర్‌లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా.. ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయి. అలాగే, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయితే అప్రమత్తంగా ఉండటం కీలకం. భారత మోహరింపులు బలంగా ఉన్నాయి. భవిష్యత్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. ఆపరేషన్ సమయంలో 88 గంటల పాటు సైన్యం అత్యంత సమర్థవంతంగా పనిచేసింది. కవ్వింపు చర్యలకు దిగితే కచ్చితంగా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని’ అని అన్నారు.
ఇదే సమయంలో 2025లో మొత్తం 31 మంది ఉగ్రవాదులు హతమార్చబడ్డారు. వారిలో దాదాపు 65 శాతం మంది పాకిస్తాన్ సంతతికి చెందినవారే ఉన్నారు. వీరిలో ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పహల్గామ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. స్థానికంగా క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదుల సంఖ్య ఇప్పుడు సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. అయితే, ఉగ్రవాద శ్రేణుల్లోకి కొత్తగా నియామకాలు దాదాపుగా లేవు. మా సమాచారం ప్రకారం దాదాపు ఎనిమిది శిబిరాలు ఇప్పటికీ చురుకుగా ఉన్నాయి. వీటిలో, రెండు అంతర్జాతీయ సరిహద్దుకు ఎదురుగా.. ఆరు నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయి. ఈ శిబిరాల్లో కొంత ఉనికి లేదా శిక్షణ కార్యకలాపాలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. అందుకే మేము నిశితంగా గమనిస్తూ ఇన్‌పుట్‌లను సేకరిస్తున్నాం. అలాంటి కార్యకలాపాలు మళ్ళీ గుర్తించబడితే, అవసరమైన ఏ చర్యనైనా తీసుకుంటాం అని హెచ్చరించారు.


