అణు క్షిపణుల్ని మోహరిస్తాం
నేనే డిజైన్ చేస్తున్నా: ట్రంప్
గోల్డెన్ ఫ్లీట్‌లో భాగమని వెల్లడి
వాషింగ్టన్: ప్రస్తుత యుద్ధ నౌకలన్నింటికంటే అతి పెద్దది. వేగంలో సాటి లేనిది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో పాటు అణు క్షిపణులను, అత్యాధునిక హై పవర్డ్ లేజర్ క్షిపణులతో శత్రు దురి్నరీక్ష్యం. అటువంటి కనీవినీ ఎరగని యుద్ధ నౌకను ఒకదాన్ని అమెరికా తయారు చేయబోతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఈ మేరకు స్వయంగా ప్రకటించారు. ‘కొత్త నౌకను నేనే డిజైన్ చేస్తా. ఎందుకంటే సహజంగా నేను మంచి సౌందర్యారాధకుణ్ణి‘ అని చెప్పుకున్నారు. దానికి ముద్దుగా బ్యాటిల్ షిప్ అని పేరు కూడా వెల్లడించారు. సాగర తలంలో అమెరికా రక్షణ కోసం తాను కలలుగంటున్న గోల్డెన్ ఫ్లీట్ ప్రాజెక్టులో ఇది కీలక భాగం కానుందని ఆయన తెలిపారు.
ఇప్పటిదాక నిర్మితమైన అన్ని యుద్ధ నౌకల కంటే కూడా ఇది కనీసం 100 రెట్లు శక్తిశాలిగా ఉండనుందంటూ ఊరించారు. గోల్డెన్ ఫ్లీట్‌లోని నౌకలన్నీ అంతే శక్తిమంతంగా ఉంటాయని కూడా ట్రంప్ భవిష్యద్దర్శనం చేశారు. తన ముద్దుల బ్యాటిల్ షిప్‌కు యూఎస్‌ఎస్ డిఫైంట్‌గా నామకరణం చేస్తామని తెలిపారు. అయితే ట్రంప్ చెప్పినట్టుగా నౌకలపై అణు క్షిపణులను మోహరించడం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి విరుద్ధం అవుతుంది. కనుక ఇది ఎంతమేరకు ఆచరణసాధ్యం అన్నదానిపై ఎన్నో సందేహాలున్నాయి. అధ్యక్షునిగా తొలి టర్మ్‌లో కూడా నేవీని ఆధునీకరించేందుకు ట్రంప్ ఎన్నో పథకాలు ప్రకటించినా అవి చాలావరకు కాగితాలకే పరిమితమయ్యాయి.
కష్టాల్లో యూఎస్ నేవీ
అమెరికా నావికా దళం కొద్ది రోజులుగా కష్టాల్లో కొనసాగుతోంది. అంచనాలు దాటి మరీ అదుపు తప్పుతున్న వ్యయం కారణంగా చిన్న తరహా యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్టును ఇటీవలే అటకెక్కించాల్సి వచ్చింది. ఫోర్డ్ శ్రేణికి చెందిన విమానవాహక నౌకల తయారీ ఆలోచన కూడా చివరి నిమిషంలో వెనక్కు తీసుకుంది. కొత్త నౌకల్లో ట్రంప్ గొప్పగా చెప్పుకున్న పలు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ఏర్పాటులో కూడా విఫలమే అయింది. వంద కోట్ల డాలర్లతో ఏళ్ల తరబడి చేపట్టిన నౌకలపై రైల్ గన్ టెక్నాలజీ ప్రాజెక్టుకు కూడా 2021లో నేవీ మంగళం పాడింది. ఈ ఈనేపథ్యంలో నేవీ స్థైర్యాన్ని పెంచేందుకే ట్రంప్ సరికొత్త బ్యాటిల్ షిప్ ఆర్ చేసినట్టు భావిస్తున్నారు.
అన్నీ అబ్బురాలే
ట్రంప్ ఊరిస్తున్న సరికొత్త అత్యాధునిక యుద్ధ నౌకలో అన్నీ అబ్బురాలేనని గోల్డెన్ ఫ్లీట్ పేరిట అమెరికా నేవీ రూపొందించిన కొత్త వెబ్ సైట్ చెబుతోంది. ‘ఇదో గైడెడ్ మిస్సైల్ యుద్ధనౌక కానుంది. తక్కువ సిబ్బంది, ఎక్కువ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు. శత్రు దుర్భేద్యంగా నిర్మాణం. ఇదే దీని మంత్రం. దీనిలో ప్రాథమిక స్థాయి ఆయుధాలే క్షిపణులు కానున్నా యి‘ అని అందులో రాసుకొచ్చారు. అయితే, దీని తయారీ బహుశా 2030 నాటికి మొదలు కావచ్చని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని నేవీ అధికారి ఒకరు చెప్పడం విశేషం!


