అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తింపు
న్యూయార్క్: అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయులపై నిఘా నానాటికీ తీవ్రమవుతోంది. కాలిఫోర్నీయాలో 49 మందిని యూఎస్ బోర్డర్ పెట్రోలింగ్ ఏజెంట్లు అరెస్టు చేశారు. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే ఇద్దరు ఎల్‌సాల్వెడార్ పౌరులతోపాటు చైనా, హైతీ, హోండూరస్, మెక్సికో, రష్యా, సోమాలియా, టర్కీ, ఉక్రెయిన్ పౌరులు ఉన్నట్లు స్పష్టంచేసింది.
వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడపడంతోపాటు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించి, అరెస్టు చేసినట్లు పేర్కొంది. కాలిఫోర్నియాలోని ఎల్‌సెంట్రో సెక్టార్‌లో ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద తనిఖీలతోపాటు ఇతర సంస్థలతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లలో వీరంతా పట్టుబడినట్లు తెలియజేసింది. తొలుత నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 దాకా చేపట్టిన తనిఖీల్లో 42 మంది దొరికిపోయారు.
అనంతరం డిసెంబర్ 10, 11న అంటారియో, కాలిఫోర్నీయాలో ‘హైవీ సెంటినల్’ పేరిట నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మరో ఏడుగురు అరెస్టయ్యారు. దీంతో అరెస్టయిన అక్రమ వలసదారుల సంఖ్య 49కి చేరుకుంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు చెందిన హోంల్యాండ్ సెక్యూరిటీ దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. అమెరికాలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అక్రమ వలసదారులు సరైన లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
వారిని కట్టడి చేయడానికే ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. కమర్షియల్ లైసెన్స్ కలిగిన ఉన్నవారికి సెమీ ట్రక్కులు నడపడానికి అనుమతి లేదు. ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనలు అడ్డుకోవడం రహదారులపై ప్రయాణికుల భద్రతను మెరుగుపర్చడం, వాణిజ్య రవాణా రంగంలో నియంత్రణ ప్రమాణాలు పటిష్టంగా పాటించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అమెరికా అధికారులు స్పష్టంచేశారు. పలువురు భారతీయులు అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి, రోడ్డు ప్రమాదాలకు కారకులైన ఉదంతాలు ఇటీవల చోటుచేసుకున్నాయి.


