భారత క్రికెటర్‌కు బెంగాల్ ప్రభుత్వ సన్మానం
రూ. 34 లక్షల బహుమతి అందించిన ‘క్యాబ్’
కోల్‌కతా: మహిళల వన్డే వరల్డ్ కప్‌ను భారత జట్టు తొలిసారి గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు, భారత మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, మాజీ ప్లేయర్ జులన్ గోస్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బెంగాల్ రాష్ట్ర అత్యుత్తమ పౌర పురస్కారం ‘బంగభూషణ్’ను రిచాకు అందిస్తున్నట్లు ప్రకటించిన మమతా బెనర్జీ దీనికి సంబంధించిన మెడల్‌ను అందజేశారు. దీంతో పాటు బెంగాల్ పోలీస్ శాఖలో రిచాను డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వరల్డ్ కప్‌లో 133.52 స్ట్రయిక్ రేట్‌తో 235 పరుగులు సాధించిన రిచా...ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉన్న తొలి బెంగాల్ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది.
రిచాపై ప్రశంసల వర్షం కురిపించిన గంగూలీ భవిష్యత్తులోనూ ఆమె ఇదే జోరును కొనసాగించడంతో పాటు మున్ముందు భారత కెప్టెన్ కూడా కావాలని ఆశీర్వదించారు. ‘క్యాబ్’ తరఫున రిచాకు బంగారు తాపడంతో చేసిన ఒక ప్రత్యేక బ్యాట్‌ను బహుకరించడంతో పాటు రూ.34 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రిచా 34 పరుగులు సాధించగా, ఆమె చేసిన ఒక్కో పరుగుకు ఒక్కో లక్ష చొప్పున ఈ బహుమతిని ఇస్తున్నట్లు ‘క్యాబ్’ ప్రకటించింది. మరో వైపు గంగూలీ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి అధ్యక్షుడవుతారని, అందుకు అన్ని విధాలా ఆయన అర్హుడని మమతా బెనర్జీ ఆకాంక్షించారు.


