2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజేత, ఛాంపియన్ జట్టు టీమిండియాలో కీలక సభ్యురాలైన రిచా ఘోష్‌కు (Richa Ghosh) చారిత్రక గౌరవం దక్కింది. రిచా పేరిట ఆమె సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.
ఇవాళ (నవంబర్ 10) జరిగిన రిచా సన్మాన కార్యక్రమం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్ మైదానాన్ని కేటాయిస్తూ.. దానికి రిచా ఘోష్ పేరుతో నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. రిచా సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, ఝులన్ గోస్వామి పాల్గొన్నారు.
రిచా పశ్చిమ బెంగాల్ నుంచి సీనియర్ ప్రపంచకప్ గెలిచిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఫలితంగా ఆమెకు బెంగాల్ ప్రభుత్వం నుంచి భారీ నజరానాలు అందాయి. ఫైనల్లో సౌతాఫ్రికాపై చేసిన ప్రతి పరుగుకు (32 పరుగులు) రూ. లక్ష చొప్పున రూ. 34 లక్షల చెక్కును రిచాకు అందించారు.
అంతకుముందు రోజే ప్రభుత్వం రిచాకు బంగ భూషణ్ బిరుదుతో పాటు రాష్ట్ర పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా రిచాకు భారీ తాయిలాలు ప్రకటించింది. గోల్డెన్ బ్యాట్, గోల్డెన్ బాల్‌తో పాటు విలువైన బంగారు గొలుసును బహుకరించింది.
కాగా, రిచా ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 24 బంతుల్లో 34 పరుగులు చేసి భారత్ 298 పరుగుల భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించింది.
అంతకుముందు ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ రిచా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఛేదనలో కీలక సమయంలో 16 బంతుల్లో 26 పరుగులు చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించింది.
లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ రిచా చెలరేగింది. 77 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. ప్రపంచకప్ మొత్తంలో రిచా మెరుపు ఇలాగే కొనసాగాయి. 8 ఇన్నింగ్స్‌ల్లో 133.52 స్ట్రయిక్‌రేట్‌తో 235 పరుగులు చేసింది.
కాగా, నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. వికెట్ కీపర్-బ్యాటర్ అయిన రిచా ప్రపంచకప్‌లో మొత్తం 12 సిక్సర్లు బాది, టోర్నీ టాప్ టాప్ హిట్టర్‌గా నిలిచింది.


