క్రికెట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, భారత ఖ్యాతిని విశ్వానికి చాటిన పలువురు క్రికెటర్లు క్రికెటేతర గౌరవ పదవులు దక్కించుకున్నారు. ఈ అంశం ప్రస్తావనకు రాగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోని.
ఈ టీమిండియా మాజీ కెప్టెన్ భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు (2007, 2011) అందించాడు. ఇందుకు గానూ ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.
1983 భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్‌కు (2008) సైతం భారత ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించింది.
భారత క్రికెట్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన సచిన్ టెండూల్కర్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ హెదాతో సత్కరించింది. విమానయాన అనుభవం లేకుండా IAF గ్రూప్ కెప్టెన్ గౌరవం దక్కించుకున్న తొలి వ్యక్తి సచిన్ టెండూల్కర్.
వీరి తర్వాత పలువురు క్రికెటర్లకు పోలీస్ శాఖలో డీఎస్పీ హోదాలో ఉద్యోగాలు లభించాయి.
2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన జోగిందర్ శర్మకు హర్యానా పోలీస్ శాఖ డీఎస్పీ హోదా కల్పించింది.
ఆతర్వాత హర్భజన్ సింగ్ (2011 ప్రపంచకప్ విజేత), మహ్మద్ సిరాజ్‌లకు (2024 టీ20 ప్రపంచకప్ విజేత) పంజాబ్, తెలంగాణ ప్రభుత్వాలు డీఎస్పీ ఉద్యోగాలతో గౌరవించాయి.
మహిళల విభాగంలో ప్రస్తుత టీమిండియా సభ్యులు, వన్డే ప్రపంచకప్ ఛాంపియన్లు అయిన హర్మన్‌ప్రీత్ కౌర్ (పంజాబ్), దీప్తి శర్మ (ఉత్తర్‌ప్రదేశ్), తాజాగా రిచా ఘోష్‌కు (పశ్చిమ బెంగాల్) ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డీఎస్పీ హోదా కల్పించాయి.
వీరే కాక మరో ముగ్గురు భారత క్రికెటర్లకు ఇతర ప్రభుత్వ శాఖల్లో కీలక ఉద్యోగాలు లభించాయి. ప్రస్తుత టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్‌కు 2018లో స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది.
కొంతకాలం క్రితం భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌కు కూడా RBIలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది.
టీమిండియా స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చహల్‌కు ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా ఉద్యోగం లభించింది. వీరు మాత్రమే కాక చాలామంది భారత క్రికెటర్లకు వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో మంచి ఉద్యోగాలు లభించాయి.


