అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (Babar Azam) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇవాళ (నవంబర్ 11) శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో బాబర్ 29 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత బాబర్ మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ సెంచరీ చేసి నేటికి 799 రోజులవుతుంది. ఇన్నింగ్స్‌ల పరంగా (3 ఫార్మాట్లలో) ఇది 83కు పెరిగింది. దీంతో బాబర్ టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఓ చెత్త రికార్డును సమం చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కూడా ఓ దశలో సెంచరీ లేక 83 ఇన్నింగ్స్‌లు ఆడాడు. విరాట్ కెరీర్‌లో మాయని మచ్చగా ఉన్న ఈ అప్రతిష్టను తాజాగా బాబర్ సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ లేకుండా ఎక్కువ ఇన్నింగ్స్‌లు ఆడిన చెత్త రికార్డు శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉంది.
జయసూర్య తన కెరీర్‌లో ఓ దశలో సెంచరీ లేకుండా 88 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ రెండో స్థానంలో ఉన్నారు. విండీస్ దిగ్గజం శివ్‌నరైన్ చంద్రపాల్ (78) మూడో స్థానంలో నిలిచాడు.
2023 ఆగస్ట్ నుంచి ఇదే తంతు
మూడు, నాలుగేళ్ల కిందట ప్రపంచ క్రికెట్‌లో అత్యంత స్థిరమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్.. 2023 నుంచి పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఆ ఏడాది ఆగస్ట్‌లో నేపాల్‌పై సెంచరీ చేసిన తర్వాత అతనిప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇటీవలికాలంలో బాబర్ ఫామ్ అదఃపాతాళానికి పడిపోయింది. ఫామ్‌లేమి కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు.
ఇదిలా ఉంటే, బాబర్ విఫలమైనా శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో పాక్ ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసేలా ఉంది. 47.1 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 261/5గా ఉంది. సల్మాన్ అఘా (95) సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతనికి జతగా మహ్మద్ నవాజ్ (10) క్రీజ్‌లో ఉన్నాడు.
చదవండి: మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ


