రంజీ ట్రోఫీ 2025-26లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (నవంబర్ 11) మహారాష్ట్రపై అద్భుతమైన శతకాన్ని (103) బాదాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇది వచ్చింది. ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ (80) మయాంక్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
తాజా సెంచరీ మయాంక్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20వది. ఈ ఇన్నింగ్స్‌తో అతను 8500 ఫస్ట్ క్లాస్ పరుగుల మార్కును (118 మ్యాచ్‌ల్లో 8533 పరుగులు) కూడా దాటాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 313 పరుగులకే ఆలౌటైంది.మయాంక్, స్మరణ్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించారు. అభినవ్ మనోహర్ (47), అనీశ్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనా 4, ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓత్సాల్ 2, రామకృష్ణ ఘోష్ ఓ వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర కర్ణాటక స్కోర్‌కు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. పృథ్వీ షా (71), జలజ్ సక్సేనా (72) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేసింది. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 4, మొహిసిన్ ఖాన్ 3, విధ్వత్ కావేరప్ప 2 వికెట్లు తీశారు.
13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక మ్యాచ్ ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. మయాంక్ సెంచరీతో సత్తా చాటగా.. అభినవ్ మనోహర్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓస్వాల్ 2, జలజ్, రజనీష్, సిద్దేశ్ వీర్ తలో వికెట్ తీశారు.
చదవండి: రాణించిన బంగ్లా బౌలర్లు


