ఆపరేషన్ సిందూర్ ఈ పేరు వింటే చాలు పాకిస్థాన్‌కు చెమటలు పడతాయి. పహల్గామ్ లోయ విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న ఉగ్రమూకలను వారి దేశంలోనే భారత్ తుదముట్టించింది. అంతే కాకుండా ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. అయితే ఆపరేషన్ సిందూర్ భయం పాక్‌ను ఇప్పటికీ వీడనట్లే కనిపిస్తుంది. అందుకే తాజాగా ఎల్‌ఓసీ సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్లలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి యావద్దేశాన్ని వేదనకు గురి చేసింది. విహారయాత్రకు వెళ్లిన పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రమూకలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా మరణించిన వారిలో అప్పుడే పెళ్లయిన నవ దంపతుల జంట ఉండడం, వారిని హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడడం చూసి కోట్లాది హృదయాలు ఆవేదనతో రగిలిపోయాయి.
దీనికి ప్రతికారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై త్రివిధ దళాల సమన్వయంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విరుచుకుపడింది. లష్కరేతోయిబాతో పాటు జైషేమహమ్మద్ ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అయితే పాకిస్థాన్‌ను ఆపరేషన్ సిందూర్ భయం (Operation Sindoor) ఇంకా వదలట్లేదు. తాజాగా భారత్‌తో సరిహద్దు ప్రాంతాలలో ఆధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను మెహరించినట్లు సమాచారం.
సరిహద్దులో ప్రత్యేక నిఘా
భారత్, పాకిస్థాన్ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్‌ని 12వ పదాదిదళ విభాగం ఏర్పాటు చేసింది. వీటితో సరిహద్దు రేఖ వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధవిమానాలు, డ్రోన్‌లపై ప్రత్యేక నిఘా ఉంచనుంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్‌కు రావల్కోట్‌ల ఈ డోన్ వ్యవస్థలను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయి. ఈ సిస్టమ్‌లో 1.5 కిలోమీటర్ల పరిధిలోని వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసేలా ప్రత్యేక వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ ఉంటుంది.
చదవండి: పాక్ పన్నాగాల్ని ముందే పసిగట్టిన పుతిన్!
దీనితో పాటు డ్రోన్ సాంకేతికత మరింతగా పెంచుకునేందుకు టర్నీ, చైనా దేశాలతో పాకిస్థాన్ (Pakistan) చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఆ దేశ నాయకులు సైతం తరచుగా భారత్‌తో యుద్ధానికి సిద్ధం అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేపథ్యంలో ఆపరేషన్ 2.0 అవసరముందని ఇటీవల విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించారు.


