వచ్చే ఏడాదిని భారత క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో మొదలు పెడుతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియాను జనవరి 3 లేదా 4 తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఈ జట్టుకు ఎంపికవుతారు.. ఎవరిపై వేటు పడే అవకాశం ఉందనే దానిపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ సిరీస్ కోసం వేర్వేరు కారణాల వల్ల ఐదుగురు ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తుంది. ఆ ఐదుగురు ఎవరంటే..
హార్దిక్ పాండ్యా
క్వాడ్రిసెప్స్ గాయం కారణంగా తాజాగా ముగిసిన సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ సిరీస్‌కు కూడా ఎంపికయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా మేనేజ్‌మెంట్ ఇతనికి విశ్రాంతినివ్వవచ్చు. హార్దిక్ స్థానంలో ఈ సిరీస్‌కు నితీష్ కుమార్ రెడ్డి ఎంపికయ్యే అవకాశం ఉంది.
జస్ప్రీత్ బుమ్రా
ఇటీవలే బ్యాక్ ఇంజ్యూరీ నుంచి కోలుకున్న బుమ్రాను కూడా టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవచ్చని తెలుస్తుంది. వరల్డ్‌కప్ నేపథ్యంలో బుమ్రాపై వర్క్ లోడ్ పడటం మేనేజ్‌మెంట్‌కు అస్సలు ఇష్టం లేదని సమాచారం. దీంతో బుమ్రాకు విశ్రాంతి అనివార్యం కావచ్చు. అతని స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయవచ్చు.
వాషింగ్టన్ సుందర్
సౌతాఫ్రికా సిరీస్‌లో 2 మ్యాచ్‌ల్లో 14 పరుగులు మాత్రమే చేసి, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతడి స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి రావచ్చు.
తిలక్ వర్మ
తిలక్ సౌతాఫ్రికా సిరీస్‌లో జట్టులో ఉన్నా, ఫస్ట్ ఛాయిస్ XIలో చోటు దక్కలేదు. ఇదే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో కదంతొక్కి తిలక్ స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోని రీఎంట్రీకి సిద్దంగా ఉండటంతో తిలక్ వన్డే జట్టులో చోటుపై ఆశలు వదులుకున్నాడు.
రిషబ్ పంత్
గత కొంతకాలంగా ఒక్క వన్డే కూడా ఆడని రిషబ్ పంత్‌ను న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణిస్తుండటంతో పంత్ కూడా వన్డే బెర్త్‌పై ఆశలు వదులుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశం ఉన్నా, ఇషాన్ కిషన్ రూపంలో పంత్‌కు మరో ప్రమాదం పొంచి ఉంది.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అవకాశాలు లేని ఆటగాళ్లు వీళ్లైతే.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రుతురాజ్, రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది.
జనవరి 11న వడోదర వేదికగా తొలి వన్డే జరుగనుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్‌లో.. మూడో వన్డే జనవరి 18న ఇండోర్‌లో జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ఇదివరకే ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టే ఈ సిరీస్‌లో యధాతథంగా కొనసాగుతుంది.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు (అంచనా)..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ , రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా


