క్రీడ ఏదైనా అందులో కెప్టెన్ పాత్ర ఎంత ఉంటుందో, వైస్ కెప్టెన్ పాత్ర కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. మైదానంలో అప్పటికప్పుడు తీసుకునే ఏ నిర్ణయంలో అయినా ఈ ఇద్దరి పాత్ర చాలా కీలకం. తుది నిర్ణయం కెప్టెన్‌దే అయినా, వైస్ కెప్టెన్ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
అయితే ఇటీవలికాలంలో క్రికెట్ లాంటి క్రీడల్లో వైస్ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. పేరుకే వైస్ కెప్టెన్‌ను ప్రకటిస్తున్నారు కానీ, మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో పెత్తనం మొత్తం కెప్టెన్‌దే. మేనేజ్‌మెంట్ కెప్టెన్లకు అతి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వైస్ కెప్టెన్లు కూడా పట్టీపట్టనట్లు ఉంటున్నారు.
భారత క్రికెట్‌లో ఈ పోకడ మరీ విపరీతంగా ఉంది. వైస్ కెప్టెన్లు పేరుకే పరిమితమవుతున్నారు. మైదానంలో వ్యూహాలు అమలు చేయడంలో వీరి పాత్ర సున్నా. వైస్ కెప్టెన్లు ఇలా పవర్ లేకుండా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది జట్టులో వీరి స్థానానికి భరోసా ఉండకపోవడం.
ఓ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసి, ఆ సిరీస్‌లో విఫలమైతే మరుసటి సిరీస్ అతను జట్టులో ఉండడు. తమ స్థానానికే గ్యారెంటీ లేనప్పుడు ఏ ఆటగాడు కూడా జట్టు వ్యూహాల్లో తలదూర్చడానికి ఇష్టడడు.
వైస్ కెప్టెన్లు పవర్‌లెస్‌గా మారిపోవడానికి సిరీస్‌కు ఒకరిని మార్చడం మరో కారణం. భారత క్రికెట్‌లో ఇటీవలికాలంలో ఇలా తరుచూ జరుగుతుంది. వ్యక్తిగతంగా రాణిస్తున్నా, సిరీస్‌కు ఓ వైస్ కెప్టెన్‌ను ఎంపిక చేస్తున్నారు. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు, కెప్టెన్ల సంప్రదాయం ఎప్పుడు మొదలైందో, అప్పటి నుంచి వైస్ కెప్టెన్లను తరుచూ మారుస్తున్నారు.
భారత టీ20 జట్టును తీసుకుంటే, ఇటీవలికాలంలో చాలామంది వైస్ కెప్టెన్లు మారారు. తాజాగా ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టుకు అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయబడగా.. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
దీనికి ముందు కొన్నాళ్లు హార్దిక్ పాండ్యా.. కొన్నాళ్లు శ్రేయస్ అయ్యర్, ఓ సిరీస్‌కు (సౌతాఫ్రికా) రవీంద్ర జడేజా, ఓ సిరీస్‌కు (జింబాబ్వే) సంజూ శాంసన్ ఉప సారథులుగా వ్యవహరించారు.
టీ20ల పరిస్థితి ఇలా ఉంటే.. టెస్ట్‌ల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సిరీస్‌కు ఒకరు.. కొన్ని సందర్భాల్లో సిరీస్ ఇద్దరు, ముగ్గురు కూడా వైస్ కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022 నుంచి చూసుకుంటే.. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, బుమ్రా, పంత్, జడేజా, పుజారా, రహానే వైస్ కెప్టెన్లుగా వ్యవహరించారు.
టెస్ట్‌లు, టీ20లతో పోల్చుకుంటే, వన్డేల్లో పరిస్థితి కాస్త బెటర్‌గా ఉంది. మొన్నటి వరకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. అతనికి డిప్యూటీగా శుభ్‌మన్ గిల్, పంత్, కేఎల్ రాహుల్ లాంటి వారు వ్యవహరించారు.
ప్రస్తుతం గిల్ వన్డే జట్టు కెప్టెన్‌గా ఉండగా.. డిప్యూటీ పోస్ట్ శ్రేయస్ అయ్యర్ కోసం కేటాయించబడింది. టెస్ట్ జట్టుకు కూడా గిల్ కెప్టెన్‌గా ఉండగా.. అతనికి డిప్యూటీగా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ గైర్హాజరీలో రవీంద్ర జడేజా ఓ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సాధారణంగా ఏ క్రీడలో అయినా భవిష్యత్త్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వైస్ కెప్టెన్లను ఎంపిక చేస్తుంటారు. కెప్టెన్ అండలో వైస్ కెప్టెన్ పాఠాలు నేర్చుకొని కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని అలా చేస్తారు. ఆనవాయితీగా ఇలాగే జరుగుతూ వచ్చింది.
భారత క్రికెట్‌లో ఇటీవలికాలంలో చూసుకుంటే.. గంగూలీ తర్వాత ధోని.. ధోని తర్వాత విరాట్ కోహ్లి వైస్ కెప్టెన్లుగా ఉండి కెప్టెన్లుగా అవతరించారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఆటగాళ్లకు వైస్ కెప్టెన్‌గా అనుభవం లేకుండానే కెప్టెన్లుగా ఎంపిక చేస్తున్నారు.
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంపిక ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఈ పరిస్థితి భారత క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని జట్లలో పరిస్థితి ఇలాగే ఉంది. వైస్ కెప్టెన్ల పాత్ర నామమాత్రంగా మారింది. కెప్టెన్ల పెత్తనం మాత్రమే నడుస్తుంది.


