నిరసనలో పాల్గొన్న హిందూ సంఘాల కార్యకర్తలు
హిందూ కార్మికుడి హత్యపై తీవ్ర నిరసనలు
ఢిల్లీలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళన
బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ముట్టడించేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
న్యూఢిల్లీ/కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడు దీపూచంద్ర దాస్‌ను అల్లరిమూకలు కొట్టి చంపడం పట్ల విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ మారణకాండను ఖండించడం పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. వందలాది మంది కార్యకర్తలు కాషాయం జెండాలు చేతబూని బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బారికేడ్లను దాటుకొని ముందుకు దూసుకొచి్చన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ హైకమిషన్ చుట్టూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏడు అంచెల బారికేడ్లు సిద్ధంచేశారు. పారా మిలటరీ బలగాలను మోహరించారు. ప్రజా రవాణా సంస్థ బస్సులను సైతం వలయంగా నిలిపి ఉంచారు. హైకమిషన్‌కు 800 మీటర్ల దూరంలోనే నిరసనకారులను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హిందువులకు రక్షణ కల్పించాలి
యువ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య పట్ల బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ సిటీలో వ్రస్తాల పరిశ్రమలో పనిచేసే దీపూచంద్ర దాస్(25)ను ఈ నెల 18న దుండగులు కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. దైవ దూషణకు పాల్పడినందుకే దీపూచంద్ర దాస్‌ను శిక్షించినట్లు దుండగులు ప్రకటించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. హిందూ కార్మికుడి హత్యను పలు దేశాలు ఖండించాయి. భారత్‌లోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా అక్కడి ప్రభుత్వం చోద్యం చూస్తోందని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్ సర్కార్ తీరును ఖండించారు. దీపూచంద్ర దాస్‌ను పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బంగ్లాదేశ్‌లోని హిందువులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని చెప్పారు. పొరుగు దేశంలోని హిందూ కుటుంబాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసనకారులు హనుమాన్ చాలీసా పఠించారు. మతపరమైన నినాదాలతో హోరెత్తించారు.
భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భారత్‌లోని తమ కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల దౌత్య సంబంధాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. ప్రణయ్ వర్మకు సమన్లు జారీ చేయడం పది రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
హిందూ కుటుంబం ఇల్లు దహనం
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చట్టోగ్రామ్‌లో హిందూ కుటుంబం ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఇంట్లో జయంతి సంఘా, బాబు షుకుశీల్ కుటుంబాలు నివసిస్తున్నాయి. దుండగుల దుశ్చర్యకు ఇల్లు చాలావరకు దహనమైపోయింది. ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. పెంపుడు శునకాలు మరణించాయి. హిందువులను హెచ్చరిస్తూ దుండగులు ఓ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఇస్లామిక్ వ్యతిరేక కార్యకలాపాలు వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అందులో హెచ్చరించారు.
కోల్‌కతాలో నిరసనలు
బంగ్లాదేశ్‌లో మైనారీ్టలైన హిందువులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ పశి్చమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది హిందూ సంఘాల సభ్యులు ‘బోంగియో జాగరణ్ మంచ్’ఆధ్వర్యంలో నగరంలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో పలువురు నిరసనకారులు, పోలీసులు గాయపడ్డారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.


