breaking news
Oscar Piastri
-
పియాస్ట్రి ప్రతాపం
బార్సిలోనా (స్పెయిన్): క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగిస్తూ... మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజేతగా అవతరించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన పియాస్ట్రి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 32 నిమిషాల 57.375 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో పియాస్ట్రి చైనా గ్రాండ్‌ప్రి, బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి, మయామి గ్రాండ్‌ప్రిలలో విజేతగా నిలిచాడు. మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ ఐదో స్థానంలో నిలిచినా... చివరి ల్యాప్‌లో జార్జి రసెల్ కారును ఢీకొట్టినందుకు అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. దాంతో వెర్స్టాపెన్ చివరకు పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ లాన్స్ స్ట్రోల్ చేతిలో నొప్పి కారణంగా రేసులో పాల్గొనలేదు. మెర్సిడెస్ డ్రైవర్ కిమి ఆంటోనెలి 53వ ల్యాప్‌లో, అలెగ్జాండర్ ఆల్బోన్ (విలియమ్స్) 27వ ల్యాప్‌లో వైదొలిగారు. 24 రేసుల ఈ సీజన్లో 9 రేసులు ముగిశాయి. 186 పాయింట్లతో పియాస్ట్రి అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 176 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 137 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడియన్ గ్రాండ్‌ప్రి జూన్ 15న మాంట్రియల్లో జరుగుతుంది. -
పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి...
ఫ్లోరిడా: గత నాలుగేళ్లు ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్లో తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొడుతున్న వెర్స్టాపెన్ను ప్రధాన రేసులో మాత్రం మెక్లారెన్ డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఫార్ములావన్ 2025 సీజన్లో భాగంగా జరిగిన ఆరో రేసు మయామి గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల రేసును పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 51.587 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్లో నాలుగో గెలుపును, వరుసగా మూడో విజయాన్ని అందుకున్నాడు.రెండో స్థానంలో లాండో నోరిస్మెక్లారెన్కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన నోరిస్ ఈసారి 1 గంట 28 నిమిషాల 56.217 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందగా... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. నలుగురు డ్రైవర్లు లియామ్ లాసన్ (వీసా క్యాష్ రేసింగ్ బుల్స్), గాబ్రియెల్ బొర్టొలెటో (స్టేక్ టీమ్ కిక్ సాబెర్), ఒలివెర్ బియర్మన్ (మనీగ్రామ్ హాస్), జాక్ దూహాన్ (అల్పైన్ టీమ్) మధ్యలోనే వైదొలిగారు. లాసన్ 36వ ల్యాప్‌లో, బొర్టొలెటో 30వ ల్యాప్‌లో, బియర్మన్ 27వ ల్యాప్‌లో, దూహాన్ తొలి ల్యాప్‌లో తప్పుకున్నారు.1997 తర్వాత తొలిసారి... నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పియాస్ట్రి ఆరంభంలో వెనుకబడ్డాడు. అయితే 14వ ల్యాప్‌లో వెర్స్టాపెన్ను వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా 1997 తర్వాత ఫార్ములావన్‌లో వరుసగా మూడు రేసుల్లో నెగ్గిన మెక్లారెన్ డ్రైవర్‌గా పియాస్ట్రి గుర్తింపు పొందాడు. చివరిసారి మెక్లారెన్ తరఫున మికా హకినెన్ ఈ ఘనత సాధించాడు.1997 సీజన్ చివరి రేసులో నెగ్గిన హకినెన్ 1998 సీజన్‌లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచాడు. ఇక 24 రేసుల తాజా సీజన్లో ఆరు రేసులు ముగిశాక ఆస్కార్ పియాస్ట్రి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక 115 పాయింట్లతో నోరిస్ రెండో స్థానంలో, 99 పాయింట్లతో వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో మెక్లారెన్ 246 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. సీజన్‌లోని తదుపరి రేసు ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి (ఇటలీ) ఈనెల 18న జరుగుతుంది.