నోరిస్‌ ‘పాంచ్‌ పటాకా’ | Lando Norris emerged triumphant in the Hungarian Grand Prix | Sakshi
Sakshi News home page

నోరిస్‌ ‘పాంచ్‌ పటాకా’

Aug 4 2025 5:58 AM | Updated on Aug 4 2025 5:58 AM

Lando Norris emerged triumphant in the Hungarian Grand Prix

ఈ సీజన్‌లో ఐదో టైటిల్‌ గెలిచిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌

హంగేరి గ్రాండ్‌ప్రిలో అగ్రస్థానం సొంతం  

బుడాపెస్ట్‌ (హంగేరి): ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో మెక్‌లారెన్‌ డ్రైవర్ల జోరు సాగుతోంది. ఆస్కార్‌ పియాస్ట్రి, లాండో నోరిస్‌ మధ్య ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన హంగేరి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో నోరిస్‌ విజయం సాధించాడు. ఈ సీజన్‌లో నోరిస్‌కిది ఐదో విజయం కాగా... మెక్‌లారెన్‌ జట్టుకిది 200వ ఎఫ్‌1 గెలుపు కావడం విశేషం. ఆదివారం జరిగిన ఈ రేసులో నోరిస్‌ నిర్ణీత 70 ల్యాప్‌లను అందరికంటే వేగం6గా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 21.231 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. 

మెక్‌లారెన్‌ జట్టుకే చెందిన పియాస్ట్రి 1 గంట 35 నిమిషాల 21.929 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రెండో స్థానంలో నిలిచాడు. 0.698 సెకన్ల తేడాతో పియాస్ట్రి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. తొలి ల్యాప్‌ ముగిసే సమయానికి ఐదో స్థానానికి పరిమితమైన నోరిస్‌ ఆ తర్వాత వాయువేగంతో దూసుకెళ్లాడు. ‘ఇది చాలా కష్టమైంది. ప్రాణం పోయినంత పనైంది. చివరి క్షణాల్లో పియాస్ట్రిని దాటేసేందుకు ఎంతగానో ప్రయత్నించా’ అని రేసు అనంతరం నోరిస్‌ అన్నాడు. గత వారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజయం సాధించగా... నోరిస్‌ రెండో స్థానంలో నిలిచాడు. 

మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ (1 గంట 35 నిమిషాల 43.147 సెకన్లు) మూడో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ ఏడాది తొలిసారి పోల్‌ పొజిషన్‌ దక్కించుకొని అగ్రస్థానంతో రేసును ప్రారంభించిన ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (1 గంట 36 నిమిషాల 3.791 సెకన్లు) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ (1 గంట 36 నిమిషాల 33.876 సెకన్లు; రెడ్‌బుల్‌) తొమ్మిదో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 గంట 35 నిమిషాల 31.092 సెకన్లలో 69 ల్యాప్‌లు; ఫెరారీ) పన్నెండో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసులో తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 14 రేసులు ముగియగా... డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో పియాస్ట్రి 284 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... నోరిస్‌ 275 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల అంతరం 9కి తగ్గగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ 187 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. తదుపరి రేసు ఈ నెల 31న డచ్‌ గ్రాండ్‌ప్రి జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement