పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి... | Oscar Piastri Extends title lead with Miami Grand Prix win Scripts History | Sakshi
Sakshi News home page

పియాస్ట్రిదే పైచేయి.. 1997 తర్వాత ఇదే తొలిసారి...

May 6 2025 10:49 AM | Updated on May 6 2025 11:02 AM

Oscar Piastri Extends title lead with Miami Grand Prix win Scripts History

పియాస్ట్రిదే పైచేయి

మయామి గ్రాండ్‌ప్రి రేసులో టైటిల్‌ సొంతం

ఈ సీజన్‌లో నాలుగో విజయం సాధించిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌

వెర్‌స్టాపెన్‌కు నాలుగో స్థానం  

ఫ్లోరిడా: గత నాలుగేళ్లు ఫార్ములావన్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించిన రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు ఈ సీజన్‌లో తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. క్వాలిఫయింగ్‌ సెషన్‌లో అదరగొడుతున్న వెర్‌స్టాపెన్‌ను ప్రధాన రేసులో మాత్రం మెక్‌లారెన్‌ డ్రైవర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 

ఫార్ములావన్‌ 2025 సీజన్‌లో భాగంగా జరిగిన ఆరో రేసు మయామి గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల రేసును పియాస్ట్రి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 28 నిమిషాల 51.587 సెకన్లలో పూర్తి చేసి ఈ సీజన్‌లో నాలుగో గెలుపును, వరుసగా మూడో విజయాన్ని అందుకున్నాడు.

రెండో స్థానంలో లాండో నోరిస్‌
మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్‌ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఈ రేసులో విజేతగా నిలిచిన నోరిస్‌ ఈసారి 1 గంట 28 నిమిషాల 56.217 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. 

మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జి రసెల్‌ మూడో స్థానాన్ని పొందగా... ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

నలుగురు డ్రైవర్లు లియామ్‌ లాసన్‌ (వీసా క్యాష్‌ రేసింగ్‌ బుల్స్‌), గాబ్రియెల్‌ బొర్టొలెటో (స్టేక్‌ టీమ్‌ కిక్‌ సాబెర్‌), ఒలివెర్‌ బియర్మన్‌ (మనీగ్రామ్‌ హాస్‌), జాక్‌ దూహాన్‌ (అల్పైన్‌ టీమ్‌) మధ్యలోనే వైదొలిగారు. లాసన్‌ 36వ ల్యాప్‌లో, బొర్టొలెటో 30వ ల్యాప్‌లో, బియర్మన్‌ 27వ ల్యాప్‌లో, దూహాన్‌ తొలి ల్యాప్‌లో తప్పుకున్నారు.

1997 తర్వాత తొలిసారి... 
నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన పియాస్ట్రి ఆరంభంలో వెనుకబడ్డాడు. అయితే 14వ ల్యాప్‌లో వెర్‌స్టాపెన్‌ను వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా 1997 తర్వాత ఫార్ములావన్‌లో వరుసగా మూడు రేసుల్లో నెగ్గిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌గా పియాస్ట్రి గుర్తింపు పొందాడు. చివరిసారి మెక్‌లారెన్‌ తరఫున మికా హకినెన్‌ ఈ ఘనత సాధించాడు.

1997 సీజన్‌ చివరి రేసులో నెగ్గిన హకినెన్‌ 1998 సీజన్‌లోని తొలి రెండు రేసుల్లోనూ విజేతగా నిలిచాడు. ఇక 24 రేసుల తాజా సీజన్‌లో ఆరు రేసులు ముగిశాక ఆస్కార్‌ పియాస్ట్రి 131 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 

ఇక 115 పాయింట్లతో నోరిస్‌ రెండో స్థానంలో, 99 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో నిలిచారు. కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌షిప్‌లో మెక్‌లారెన్‌ 246 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది. సీజన్‌లోని తదుపరి రేసు ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి (ఇటలీ) ఈనెల 18న జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement