టీమిండియా భవిష్యత్ తారగా పేరు తెచ్చుకుంటున్న ఉత్తర్‌ప్రదేశ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్ దేశవాలీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 93 సగటున, 122.90 స్ట్రయిక్‌రేట్‌తో 558 పరుగులు చేసిన ఇతను.. ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లోనూ అదే సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు.
విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జురెల్ ఒంటరిపోరాటం చేశాడు. 122 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి, నాలుగు పరుగుల తేడాతో ఎంతో అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. జురెల్‌కు మరో ఎండ్‌లో శివమ్ మావి (47) సహకరించడంతో ఉత్తర్‌ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగలిగింది.
జురెల్, మావి మినహా యూపీ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే 6 వికెట్లతో చెలరేగి యూపీని ఘెరంగా దెబ్బ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్ మోఖడే (19), సత్యం భోయార్ (13) క్రీజ్‌లో ఉన్నారు.
సూపర్ ఫామ్
జురెల్ ఇటీవల కాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడు లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు సెంచరీలు బాదాడు.
అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన (14 & 13, 0 & 2) జురెల్.. దానికి ముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో అదరగొట్టాడు. దీనికి ముందే టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేసిన జురెల్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం రెండో టెస్ట్‌లోనూ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు.


