నిప్పులు చెరిగిన సిరాజ్‌ | Ranji trophy 2025-26: Siraj four for rocks Chhattisgarh | Sakshi
Sakshi News home page

నిప్పులు చెరిగిన సిరాజ్‌

Jan 29 2026 7:19 PM | Updated on Jan 29 2026 7:31 PM

Ranji trophy 2025-26: Siraj four for rocks Chhattisgarh

రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా ఛత్తీస్‌ఘడ్‌తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 17 ఓవర్లలో 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. 

సిరాజ్‌తో పాటు రక్షన్‌ (9.3-1-28-2), తనయ్‌ త్యాగరాజన్‌ (20-3-81-1), హిమతేజ (4-0-18-1), అనికేత్‌ రెడ్డి (12-0-65-1) సత్తా చాటడంతో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఛత్తీస్‌ఘడ్‌ 283 పరుగులకే పరిమితమైంది. ఏడో స్థానంలో బరిలోకి దిగిన ప్రతీక్‌ యాదవ్‌ (99 బంతుల్లో 106; 10 ఫోర్లు, సిక్స్‌) అనూహ్యంగా సెంచరీ చేసి ఛత్తీస్‌ఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. 

ప్రతీక్‌కు వికల్ప్‌ తివారి (94) సహకరించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 183 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యాన్ని త్యాగరాజన్‌ విడగొట్టాడు. రెండు పరుగుల వ్యవధిలోనే సిరాజ్‌ సెంచరీకి చేరువైన వికల్ప్‌ తివారిని ఔట్‌ చేసి ఛత్తీస్‌ఘడ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 

వికల్ప్‌, ప్రతీక్‌ మినహా ఛత్తీస్‌ఘడ్‌ ఇన్నింగ్స్‌లో ఎ‍వ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆయుశ్‌ పాండే 11, అనుజ్‌ తివారి 4, సంజీత్‌ దేశాయ్‌ 1, కెప్టెన్‌ అమన్‌దీప్‌ ఖారే 16, మయాంక్‌ వర్మ 3, సహబాన్‌ ఖాన్‌ 20, ఆదిత్య సర్వటే 4, దేవ్‌ ఆదిత్య సింగ్‌ 16 పరుగులకు ఔటయ్యారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్‌రావ్‌ 32, అభిరథ్‌ రెడ్డి 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement