ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లలో గ్లెన్ మెగ్రాత్‌కు తప్పక స్థానం ఉంటుంది. కంగారూ జట్టు తరఫున 1993 నుంచి 2007 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. 124 టెస్టులు, 250 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లలో భాగమయ్యాడు.
తన కెరీర్‌లో మొత్తంగా టెస్టుల్లో ఏకంగా 563 వికెట్లు కూల్చిన మెగ్రాత్.. వన్డేల్లో 381, టీ20లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల వంటి మేటి జట్లకు చెందిన బ్యాటర్లకు సమర్థవంతంగా బౌలింగ్ చేసిన ఘనత అతడికి ఉంది.
ఈ ఐదుగురూ తక్కువేమీ కాదు
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన గ్లెన్ మెగ్రాత్ (Glenn McGrath).. తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ఐదుగురు బ్యాటర్ల పేర్లను వెల్లడించాడు. అయితే, అంతకంటే ముందు ఈ టాప్-5ని భర్తీ చేయగల సత్తా ఉన్న మరో ఐదుగురు బ్యాటర్ల పేర్లు కూడా మెగ్రాత్ తెలిపాడు.
శ్రీలంకకు చెందిన అరవింద డిసిల్వ, ఇంగ్లండ్ స్టార్లు కెవిన్ పీటర్సన్, అలిస్టర్ కుక్.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు సయీద్ అన్వర్, టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag)లను మెగ్రాత్ ఈ జాబితాలో చేర్చాడు.
అతడే అందరికంటే టఫ్
ఇక తన టాప్-5 టఫెస్ట్ బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానాన్ని ఇంగ్లండ్ లెఫ్టాండర్ బ్యాటర్, దివంగత గ్రాహమ్ థోర్పేకు ఇచ్చాడు మెగ్రాత్. నాలుగో స్థానాన్ని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌కు కట్టబెట్టిన ఈ రైటార్మ్ పేసర్.. మూడో స్థానంలో భారత టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్‌ను నిలిపాడు.
అదే విధంగా... టీమిండియా దిగ్గజం, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు రెండో స్థానం ఇచ్చిన మెగ్రాత్.. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్‌గా వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా పేరు చెప్పాడు.
పరుగుల వరద
కాగా మెగ్రాత్ టాప్-5లో ఉన్న వారంతా అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన వారే. గ్రాహమ్ థోర్పే 9000 పరుగులు చేయగా.. డివిలియర్స్ ఖాతాలో ఇరవై వేల రన్స్ ఉన్నాయి. ఇక లక్ష్మణ్ టెస్టుల్లో 8781 పరుగులు సాధించగా.. సచిన్ 34,357 రన్స్‌తో టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా లారా 430 మ్యాచ్‌లలో కలిపి 22000 పరుగులు సాధించాడు.
గ్లెన్ మెగ్రాత్ ఎదుర్కొన్న టఫెస్ట్ బ్యాటర్లు టాప్-5
🏏బ్రియన్ లారా
🏏సచిన్ టెండుల్కర్
🏏వీవీఎస్ లక్ష్మణ్
🏏ఏబీ డివిలియర్స్
🏏గ్రాహమ్ థోర్పే.


