త్వరలో భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి ఓ ముఖ్య సమాచారం అందుతోంది. ఈ మెగా టోర్నీ ఓపెనింగ్ సెర్మనీ ఖరారు కావడంతో పాటు వేడుక జరిగే తేదీ మరియు సమయాన్ని ప్రకటించారు. టోర్నీ ప్రారంభమయ్యే ఫిబ్రవరి 7వ తేదీనే ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగనున్నాయి.
ఆ రోజు వేర్వేరు వేదికల్లో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగనుండగా.. మూడో మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. మూడో మ్యాచ్‌లో భారత్, యూఎస్‌ఏ జట్లు ముంబైలోని వాంఖడే మైదానంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి ముందే ఓపెనింగ్ సెర్మనీ జరుగుతుంది.
అదే రోజు టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కొలొంబో వేదికగా ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ వెస్టిండీస్, స్కాట్లాండ్ మధ్య కోల్‌కతా వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది.
కాగా, టీ20 ప్రపంచకప్ 2026 భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లలన్నీ గ్రూప్‌కు ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విడిపోయాయి.
గ్రూప్-సి నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో స్కాట్లాండ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. భారత్, పాక్ గ్రూప్-ఏలో పోటీపడనున్నాయి. పాక్ తమ మ్యాచ్‌లన్నీ (భారత్ మ్యాచ్‌తో సహా) శ్రీలంకలో ఆడనుంది. భారత్-పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
గ్రూప్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ దశలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు.. సెమీస్‌లో గెలిచే జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన భారత్.. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.


