పియాస్ట్రి ప్రతాపం | McLaren driver wins Spanish Grand Prix | Sakshi
Sakshi News home page

పియాస్ట్రి ప్రతాపం

Jun 2 2025 1:07 AM | Updated on Jun 2 2025 1:07 AM

McLaren driver wins Spanish Grand Prix

స్పానిష్‌ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెక్‌లారెన్‌ డ్రైవర్‌

బార్సిలోనా (స్పెయిన్‌): క్వాలిఫయింగ్‌ సెషన్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ కొనసాగిస్తూ... మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజేతగా అవతరించాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన పియాస్ట్రి ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. నిర్ణీత 66 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 32 నిమిషాల 57.375 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

ఈ సీజన్‌లో పియాస్ట్రి చైనా గ్రాండ్‌ప్రి, బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి, సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి, మయామి గ్రాండ్‌ప్రిలలో విజేతగా నిలిచాడు. మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్‌ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఐదో స్థానంలో నిలిచినా... చివరి ల్యాప్‌లో జార్జి రసెల్‌ కారును ఢీకొట్టినందుకు అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. దాంతో వెర్‌స్టాపెన్‌ చివరకు పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

మరోవైపు ఆస్టన్‌ మార్టిన్‌ జట్టు డ్రైవర్‌ లాన్స్‌ స్ట్రోల్‌ చేతిలో నొప్పి కారణంగా రేసులో పాల్గొనలేదు. మెర్సిడెస్‌ డ్రైవర్‌ కిమి ఆంటోనెలి 53వ ల్యాప్‌లో, అలెగ్జాండర్‌ ఆల్బోన్‌ (విలియమ్స్‌) 27వ ల్యాప్‌లో వైదొలిగారు. 24 రేసుల ఈ సీజన్‌లో 9 రేసులు ముగిశాయి. 186 పాయింట్లతో పియాస్ట్రి అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 176 పాయింట్లతో నోరిస్‌ రెండో స్థానంలో, 137 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడియన్‌ గ్రాండ్‌ప్రి జూన్‌ 15న మాంట్రియల్‌లో జరుగుతుంది.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement