న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్య సంక్షోభం నగర వాసులు అతలాకుతలం చేస్తోంది. ఎటు చూసినా కాలుష్య మేఘాలు దట్టంగా కమ్మేశాయి. రోజు రోజుకీ అత్యంత దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత మధ్య చిన్నా, పెద్దా అంతా పలు రకాల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈనేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని సంస్థలకు 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కంపెనీలు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో పనిచేయాలని తెలిపింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని కూడా హెచ్చరించింది.అలాగే తాజా ప్రకటన ప్రకారం, ప్రస్తుత కాలుష్య నిరోధక ఆంక్షల కింద నిర్మాణ కార్యకలాపాలను నిషేధించిన నేపథ్యంలో ప్రస్తుతం పని చేయలేని రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10,000 పరిహారం అందిస్తుంది.
ఇదీ చదవండి: మెస్సీకి అనంత్ అంబానీ సర్‌ప్రైజ్ గిఫ్ట్, ఖరీదెంతో తెలుసా?
కాగా గత కొన్నేళ్లుగా కాలుష్య కాసారంగా మారిపోయిన దేశ రాజధాని నగరంలోడిసెంబర్ 15న సీజన్‌లో అత్యంత దారుణమైన వాయు నాణ్యత నమోదైంది. వాయు నాణ్యత AQI 'తీవ్రమైన ప్లస్' కేటగిరీలో 498గా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, అంతకు ముందు రోజు నుంచే AQI క్షీణించడం కొనసాగింది. వాయు నాణ్యత ఇంత దిగజారి పోవడం ఇదే తొలిసారి. శనివారం నుండి సోమవారం వరకు రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో, పలు రోడ్డు ప్రమాదాలు, వాహనాల గుద్దు కోవడాలు, విమానాల రద్దు, లేదా ఆలస్యాలు జరిగాయి. దీన్ని ఎదుర్కొనే చర్యల్లో భాగంగాఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) త్వరగా రాజధాని అంతటా అత్యంత కఠినమైనకాలుష్య నిరోధక ఆంక్షలను అమలు చేస్తోంది.


