‘సింధూర్‌లో అదే జరిగింది’.. క్షమాపణలు లేవన్న చవాన్ | No Apology Congresss Prithviraj Chavan Defiant On Sindoor Remark | Sakshi
Sakshi News home page

‘సింధూర్‌లో అదే జరిగింది’.. క్షమాపణలు లేవన్న చవాన్

Dec 17 2025 11:20 AM | Updated on Dec 17 2025 11:31 AM

No Apology Congresss Prithviraj Chavan Defiant On Sindoor Remark

ముంబై: ఆపరేషన్ సింధూర్‌లో మొదటి రోజే భారత్ ఓడిపోయిందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ‘నేను ఎలాంటి తప్పు మాట్లాడలేదు. దీనిపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని ఆయన బుధవారం పేర్కొన్నారు. పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘ఆపరేషన్ సింధూర​ ప్రారంభంలో పాక్ బలగాలు.. భారత విమానాలను కూల్చివేశాయని, తద్వారా భారత వైమానిక దళం వెనక్కి తగ్గిందంటూ పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశం అధికార బీజేపీకి  ఆయుధంగా మారింది.

చవాన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. కాంగ్రెస్ ఎప్పుడూ పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉంటూ, దేశాన్ని అవమానిస్తోందని బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ విదేశాలలో దేశ ప్రతిష్టను దిగజార్చితే, చవాన్ ఇక్కడ సైన్యం నైతికతను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ దీనిపై స్పందిస్తూ.. భారత సైన్యం తిరుగులేని శక్తి అని కొనియాడారు. కానీ గతంలో ఇందిరా గాంధీ  నాయకత్వంలో సాధించిన విజయాలను గుర్తు చేస్తూ, ఆయన ప్రధాని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు.

ఆపరేషన్ సింధూర్ అనేది గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పీఓకేలోని సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం మట్టుబెట్టింది. పాకిస్తాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ, భారత క్షిపణి రక్షణ వ్యవస్థ వాటిని విజయవంతంగా అడ్డుకుంది. ఈ పోరులో పాక్  నాలుగు ఫైటర్ జెట్‌లను కోల్పోయిందని, వారి సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. ఇదే సమయంలో భారత విమానాలను, ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చేశామన్న పాక్ వాదనలను ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కొట్టిపారేశారు. అవి కేవలం పాక్ పౌరులను నమ్మించడానికి ఆ దేశం చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement