మణికొండ: అడుగులోపు ఎత్తుతో హుషారెత్తించేవి కొన్ని.. అతి గంభీరమైన చూపులతో హడలెత్తించేవి మరికొన్ని.. వింత వేషాలు, అంతర్జాతీయ చరిత్ర ఉన్న కుక్కలన్నీ ఒక చోట చేరాయి. పులి చారలతో అతి చిన్నగా, అతి పెద్దగా వింత ఆకారాలతో ఉన్న పిల్లలు సైతం వచ్చాయి.
నగర శివారు నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని ఓం కన్వెన్షన్‌లో శనివారం ప్రారంభమైన పెట్ షో అలరించింది.
వందలాది రకరకాల బ్రీడ్‌లకు చెందిన 500 కుక్కలు, 100 పిల్లులు ఈ షోకు తమ యజమానులతో పాటు హాజరయ్యాయి.
ఎన్నో రకాల చేపలతో ఏర్పాటు చేసిన అక్వేరియంలు చిన్నారులను ఆకట్టుకున్నాయి.
మొదటి సారిగా హైక్యాన్ 2025, తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీతో కలిసి సేఫ్ విత్ డాగ్స్ అనే ప్రజా విజ్ఞాన కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
దేశంలోని పోలీస్, భద్రతా దళాల్లో సేవలందిస్తున్న కుక్కలు ధైర్య సాహసాలను అందరికీ వివరించి వాటిని సత్కరించి అవార్డులను అందజేశారు.
తన చెర్రీతో హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


